మొదలైన తునికాకు కోత.. | - | Sakshi
Sakshi News home page

మొదలైన తునికాకు కోత..

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

● రేటు ఒప్పందం కుదరడంతో సేకరణ ● తొలుత చెట్టుపల్లి యూనిట్‌లో ప్రారంభం

● రేటు ఒప్పందం కుదరడంతో సేకరణ ● తొలుత చెట్టుపల్లి యూనిట్‌లో ప్రారంభం

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్టకేలకు తునికాకు సేకరణ మొదలైంది. నాలుగు రోజులుగా చెట్టుపల్లి యూనిట్‌లోని పలు గ్రామాల్లో గిరిజనులు ఆకు సేకరణ ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం వరకు మే డే తర్వాత ఆకు సేకరణ మొదలు పెట్టేవారు. కానీ, రెండేళ్ల నుంచి ముందుగానే ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఏప్రిల్‌ మొదటి వారంలో రేటు ఒప్పందం జరగడంతో గిరిజనులు అడవి బాట పడుతున్నారు.

పాతికేళ్ల క్రితం పండుగలా..

వేసవి వచ్చిందంటే చాలు పాతికేళ్ల క్రితం వరకు తునికాకు సేకరణ పల్లెల్లో పండుగలా జరిగేది. గిరిజనులు రెండో పంటగా భావిస్తూ వేసవిలో ఆకు సేకరణకు ఆసక్తి చూపేవారు. అంతేకాక రేటు పెంచాలనే డిమాండ్‌తో ఆందోళనలు, పార్టీల మధ్య చర్చలు కొనసాగేవి. ఇందులో మావోయిస్టులు, ఇతర పార్టీల నేతల ప్రభావం కనిపించేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యాన చర్చలు, ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా గుండాల మండలం కాచనపల్లిలో చర్చించి ధర ఖరారు చేశారు. అయితే, కాలక్రమేణా అడవి అంతరించడం, పోడు వ్యవసాయంతో చెట్లు లేకపోవడంతో ఆకు సేకరణ కూడా తగ్గిపోతోంది.

ఏపుగా పెరగని తునికాకు

తునికాకు సీజన్‌కు ముందు ఒకటి, రెండు వర్షాలు కురవడం, ఆకు ఏపుగా ఎదగడం పరిపాటిగా ఉండేది. కానీ ఈదఫా వర్షాలు లేకపోవడంతో ఆకు అంత గా ఎదగలేదు. దీంతో ఆకు సేకరణ తక్కువ రోజులే కొనసాగే అవకాశముంది. ప్రస్తుతానికి గుండాల మండలం చెట్టుపల్లిలో సేకరణ మొదలుపెట్టారు.

భద్రాద్రి జిల్లాలో..

జిల్లాలో 19 మండలాల్లో పోరాట కమిటీతో కాంట్రా క్టర్లు రేటు ఒప్పందం చేసుకున్నారు. న్యూడెమోక్రసీ, మాస్‌లైన్‌, చంద్రన్న వర్గం, సీపీఐ, సీపీఎం, తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల నేతలతో కాంట్రాక్టర్లు ఈ నెల 18న గుండాల మండలం కాచనపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 ఆకుల కట్టకు రూ. 3.42 ధర ఖరారైంది. అయితే, భద్రాద్రి జిల్లాలోని 19 మండలాల్లో లభించే తునికాకు నాణ్యతగా ఉంటుంది. దీంతో కాంట్రాక్టర్లు ఆయా మండలాల మీదే ఆధారపడతారు. ప్రస్తు తం పెంచిన ధర కూడా గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు, బయ్యారం, గంగారం, పాకాల, గూడూరు తదితర మండలాల్లో అమలుకానుంది. మిగతా చోట్ల ప్రభుత్వం ఖరారు చేసిన ధర ప్రకారమే చెల్లిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement