ధరపై ఉత్పత్తి ప్రభావం
గుడ్డు ధర రూ.5లోపే
● కోళ్ల ఉత్పత్తి పెరగడంతో ధర పతనం ● ఎగుమతులు లేక గుడ్డుకూ గడ్డుకాలమే.. ● పౌల్ట్రీ పరిశ్రమల నిర్వహణ భారంతో రైతులకు నష్టాలు
ఖమ్మంవ్యవసాయం: కోళ్ల పరిశ్రమలు నిర్వహిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. కోళ్ల ఉత్పత్తి పెరగటంతో డిమాండ్ పడిపోయి ధర పతనం కాగా.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యాన ఎగుమతులు లేక గుడ్డుకు సైతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక వేసవిలో పరిశ్రమల నిర్వహణ ఖర్చులు పెరిగి నష్టాలను చవిచూడక తప్పడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, కొణిజర్ల, కొత్తగూడెం, సుజాత్‌నగర్, మణుగూరు తదితర ప్రాంతాల్లో బ్రాయిలర్, లేయర్ కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 60 లక్షల సామర్ధ్యం కలిగిన బ్రాయిలర్ పరిశ్రమలు, ఐదు లక్షల సామర్థ్యం లేయర్ పరిశ్రమలు కొనసాగుతున్నాయి.
నిర్వహణ భారం
హ్యచరీలో కోడి పిల్ల ధర రూ.65కు చేరడంతో దాణాగా వినియోగించే సోయాబీన్ ధరలు సైతం పెరిగాయి. సుమారు 2 కిలోల బరువుతో కోడి పెంపకానికి దాణా ఖర్చు రూ.160 అవుతుండగా.. ఇతర ఖర్చులు రూ.30 వరకు ఉంటాయి. మొత్తంగా రెండు కిలోల కోడి పెంపకానికి రూ.255 వరకు వుతుంటే... ప్రస్తుతం పౌల్ట్రీ వద్ద రెండు కిలోల లైవ్ బర్డ్ ధర రూ.196గానే ఉంది. ఫలితంగా ఒక్కో కోడి రూ.60.. వేలాదిగా కోళ్లతో పరిశ్రమలను నిర్వహించే వారు రూ.లక్షల్లో నష్టపోతున్నారు.
వేసవిలో కోళ్ల పరిశ్రమ నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఇటీవల కోళ్లకు ధర పెరగడంతో అంతా ఆసక్తి చూపగా ఉత్పత్తి ఒకేసారి వచ్చి ధరపై ప్రభావం పడింది. పరిశ్రమ వద్ద కిలో లైవ్ బర్డ్ ధర రూ.98 దాటకపోగా.. 35 వేల కోళ్ల పెంపకంతో దాదాపు రూ.20 లక్షలు నష్టం వాటిల్లుతోంది.
– కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, తక్కెళ్లపాడు
ఓ వైపు కోడి పిల్లలు, దాణా ధరలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా.. ఉత్పత్తి పెరగటం, పోటీ కారణంగా కోళ్ల ధరలు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం పరిశ్రమల నిర్వాహకులను కోలుకోలేని దెబ్బతీస్తుంది. వేసవిలో కోళ్ల పెంపకానికి ఖర్చు మరింత పెరిగి నష్టాలే వస్తున్నాయి.
– రావి బాబూరావు, పౌల్ట్రీ నిర్వాహకుడు, ఖమ్మం
గతేడాది నవంబర్ నుంచి చికెన్ ధరలు పెరిగాయి. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి, సమ్మక్క–సారలమ్మ జాతరతో పాటు శుభ ముహూర్తాలు ఉండటంతో ఓ దశలో కిలో చికెన్ ధర రూ.350కు చేరింది. మార్చి వరకు డిమాండ్ ఉండడంతో పౌల్ట్రీల నిర్వాహకులు ఉత్పత్తిని పెంచారు. దీంతో ఏప్రిల్ ఆరంభం నుంచి కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో డిమాండ్ తగ్గి ధరపై ప్రభావం పడింది. సమ్మక్క–సారలమ్మ జాతర సమయంలో పరిశ్రమ వద్ద కిలో కోడి ధర ఓ దశలో రూ.180 పలకగా.. ఆ తర్వాత రూ.150కి.. గత వారం నుంచి రూ.98కు పడిపోయింది. ఈ ధర రైతులకు ఎంతమాత్రం గిట్టుబాటు కాకున్నా నష్టాలను చవిచూస్తూనే విక్రయించక తప్పటం లేదు. ఇదే సమయాన చికెన్ కంపెనీలు, షాపుల నిర్వాహకులు మాత్రం డిమాండ్ ఆధారంగా కిలో చికెన్‌ను రూ.210 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు.
యుద్ధ ప్రభావం కోడిగుడ్ల ధరపై పడింది. రవాణా జరకగ, ఎగుమతులకు అవకాశాలు లేకపోవటంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యే గుడ్డుకు డిమాండ్ పడిపోయింది. గత ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు గుడ్డు రిటైల్ ధర ప్రాంతాల వారీగా రూ.8 నుంచి రూ.9 వరకు పలికింది. ఆ తర్వాత ధర పతనమవుతూ ప్రస్తుం కోళ్ల పరిశ్రమల వద్ద రూ.4.70కు మించి పలకడం లేదు. ఇలా లేయర్ కోళ్ల పరిశ్రమల రైతులు నష్టాలను చవిచూడక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.


