ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

రఘునాధపాలెం: మండలంలోని వీ.వీ.పాలెంలో కంఠమహేశ్వర – సూరమాంబ దేవాలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకట నర్సయ్య రూ.లక్ష విరాళం అందజేశారు. ఆయన గతంలో రూ.75వేలు అందించగా, మిగతా రూ.25వేలను సోమవారం అందించారని కమిటీ బాధ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన

తల్లాడ: నెల రోజులుగా వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ తల్లాడ మండలం నూతనకల్‌ సొసైటీ కార్యాలయానికి సోమవారం రైతులు తాళం వేశారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు కళ్యాణపు కృష్ణయ్య, తూము శ్రీనివాసరావు ఆధ్వర్యాన రైతులు సోమవారం ఆంధోళన చేపట్టారు. నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈమేరకు నూతనకల్‌ సొసైటీ సిబ్బందిని బయటకు పంపించి తాళం వేశారు. మాజీ సర్పంచ్‌ తూము శ్రీనివాసరావుతో పాటు శెట్టిపల్లి లక్ష్మణ్‌రావు, వేమిరెడ్డి సీతారామిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.

మృత్యువుతో

పోరాటంలో ఓటమి

52రోజులుగా చికిత్స పొందుతున్న

విద్యార్థి మృతి

నేలకొండపల్లి: ఇంటర్‌ పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేలకొండపల్లి మండలానికి చెందిన విద్యార్థులు మార్చి 6న ఇంటర్‌ పరీక్ష రాసి బైక్‌లపై వస్తుండగా కారు ఢీకొట్టింది. ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఆతర్వాత ఐదు రోజులకు కోరట్లగూడెంకు చెందిన అభిరామ్‌ మృతి చెందాడు. అలాగే, ఆరెగూడెంకు చెందిన బోయిన ఉదయ్‌(18)కు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా 52 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన సోమవారం కన్నుమూయడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.

రెండేళ్లుగా పరారీలో ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌

ఖమ్మంక్రైం: విదేశీ విద్య కోసం రుణాల పేరిట రూ.3.50కోట్లు కాజేసి రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న బ్యాంక్‌ మేనేజర్‌ను సోమవారం ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలానికి చెందిన కొంగర రామకృష్ణ ఖమ్మం వైరారోడ్‌లో కొనసాగిన ఇండస్‌ ఇండో బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు వస్తే అకౌంట్‌ తెరిపించి, ఇతర బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేవాడు. తద్వారా వచ్చే కమీషన్‌ను స్టార్‌ పవర్‌ ఏజెన్సీ ద్వారా తన భార్య, ఇతరుల అకౌంట్లలో జమ చేయించుకున్నాడు. ఇలా జమ చేయించుకున్న రూ.3.50కోట్లలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోగా, మిగిలిన డబ్బు సొంతానికి వాడుకున్నాడు. చివరకు కేతిరెడ్డి జయచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో 2024లో పోలీసులు కేసు నమోదు చేయగా రామకృష్ణ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈమేరకు సాంకేతిక ఆధారాలతో గుర్తించి ఆయనను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కరుణాకర్‌ తెలిపారు.

ఆయిల్‌పామ్‌ తోట దగ్ధం

ఖమ్మంరూరల్‌: మండలంలోని ఆరెంపులలో బండి నరేష్‌కు చెందిన ఆయిల్‌పామ్‌ తోట నిప్పంటుకుని దగ్ధమైంది. ఆయన రెండెకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నాడు. అయితే సోమవారం ఈ తోట పక్కనే సాగైన మొక్కజొన్న చేనుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఎగిసిన మంటలు ఆయిల్‌పామ్‌ మొక్కలకే కాక నీరు సరఫరా చేసే పైప్‌లైన్‌కు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. పంట చేతికందే దశలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయాయనని నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement