● ఇంధన కష్టాలకు కేంద్రమే కారణం ● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, విజ్జూకృష్ణన్
కొణిజర్ల: దేశ మహిళలను మోసగించేలా మహిళా బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవడానికి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, విజ్జూకృష్ణన్ విమర్శించారు. డీలిమిటేషన్‌కు మహిళా బిల్లును ముడిపెట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధి మండలంలోని లాలాపురంలో సీపీఎం సీనియర్ నాయకుడు సంక్రాంతి మధుసూదన్‌రావు ప్రథమ వర్ధంతి సభ సోమవారం నిర్వహించగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించడమే కాక జీవితచరిత్ర పుస్తకాన్ని నాయకులు ఆవిష్కరించారు. అనంతరం రాఘవులు, విజ్జూకృష్ణన్ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ ఎన్నికలే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం డీజిల్, పెట్రోలు ధరలు పెంచకుండా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడంతో కొరత ఏర్పడిందన్నారు. ఫలితంగా సామాన్యులు ఇబ్బంది పడడమే కాక వ్యవసాయ రంగం, ధాన్యం కొనుగోళ్లు మందగించాయని తెలిపారు. ఇక ఇరాన్ నుంచి రావాల్సిన చమురు ఓడలను అమెరికా అడ్డుకున్నా ప్రధాని మోదీ ట్రంప్‌కు మోకరిల్లి నోరు మెదపడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో అస్తవ్యస్తం
రాష్ట్రంలో పరిపాలన సరిగా లేక అస్తవ్యస్తంగా మారిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి పరిపాలన దిగజారిందన్నారు. ఇకనైనా హామీల అమలుపై పాలకలు దృష్టి సారించాలన్నారు. కాగా, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసే నాయకుల అవసరం ఉందని.. అలాంటి నాయకుడు మధుసూదనరావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ యూపీ, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు దేశ సంపదను దోచి పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సంక్రాంతి పురుషోత్తమరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శనరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు సోమయ్య, భారతి, మల్లెంపాటి వీరభద్రం, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, చింతనిప్పు సులోచన, తాళ్లపల్లి కృష్ణ, కొప్పుల కృష్ణయ్య, చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి చంద్రశేఖర్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వడ్డె నారాయణరావు, మధుసూధనరావు కుటుబీకులు సామ్రాజ్యం, రవి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


