మధిర : ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఇకనైనా జాప్యాన్ని విడనాడి కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. మధిర వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం రైతులతో మాట్లాడిన ఆయన సమస్యలు తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, కాటాలు, రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెప్పారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ప్రతీ ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం హామీ అమలు కావడం లేదన్నారు. అలాగే, కౌలు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించి షరతులు లేకుండా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మడుపల్లి గోపాలరావు, శీలం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


