● ఉపాలయాల్లో మూర్తులకు కళావాహన ● పూజల్లో పాల్గొన్న త్రిదండి చిన్నజీయర్ స్వామి
భద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో ప్రధాన ఘట్టం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆలయ నిర్మాణం అనంతరం ఏకకాలంలో 15 ఉపాలయాల్లోని 72 మూలమూర్తులు, మూడు గోపురాలకు ఒకే రోజు కళావాహన నిర్వహించడం తొలిసారని రిటైర్డ్ అర్చకులు పేర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉపాలయాలు, ఆళ్వార్ల గుడులను తొలగించాల్సి వస్తోంది. దీంతో మూలమూర్తులను తరలించేందుకు కళావాహన చేపట్టారు. జీర్ణోద్ధరణకు అర్చకులు మూలమూర్తుల వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి హాజరయ్యారు. అనంతరం ఆలయ భక్త రామదాసు, భద్రగిరి మహర్షి, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఇతర ఉపాలయాల్లో కళావాహన చేశారు.
60 మంది రుత్విక్కులతో..
వివిధ ఆలయాల నుంచి వచ్చిన 60మంది రుత్వి క్కులు, ఆలయ అర్చకులు మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి పుణ్య జలాలను తీసుకొచ్చి యాగశాలలో పూజలు చేశారు. కళావాహన అనంతరం విగ్రహాలను కదిలించారు. శ్రీలక్ష్మీతాయారు, గోదాదేవి అమ్మవార్లను ప్రధాన ఆలయ ముఖమండపం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచుతా మని, ఇతర మూర్తులను రంగనాయకుల గుట్టపై ధ్యానమందిరంలో నిర్మించిన తాత్కాలిక బాలాలయంలో కొలువుదీర్చుతామని అధికారులు తెలి పారు. కాగా, మధ్యాహ్నంవరకు స్వామివారి దర్శ నం నిలిపివేయగా, సమాచారం తెలియని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేచి చూశారు.
భక్త రామదాసుకు ప్రాధాన్యం
ప్రపంచ వ్యాప్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం భద్రాచలం రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. కళావాహన అనంతరం ఆలయ విలేకర్లతో మాట్లాడారు. రామయ్య స్వామి ఆలయం నిర్మించిన భక్త రామదాసుకు నూతన ఆలయ అభివృద్ధిలో కీలక ప్రాధాన్యం కల్పించాలన్నారు. ప్రధానాలయంలో రామయ్యకు ఒక వైపు శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, మరో వైపు గోదాదేవి, లక్ష్మీతాయారు అమ్మవారికి ఎదురుగా భక్త రామదాసు విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. నిత్యం రామయ్యతో పాటు రామదాసుకు పూజలు జరగాలన్నారు. ఆలయ అభివృద్ధి అనంతరం ఉపాలయాలన్నీ ఒక వైపు, ఆళ్వార్లు మరోవైపు ఒకే చోట భక్తులకు దర్శనానికి ఉంటారని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పూజల్లో పాల్గొని, ఈఓను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు దంపతులు, ఏఈఓ లు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, ఉత్సవ కమిటీ బాధ్యులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు, రిటైర్డ్ ప్రధానాచార్యులు పొడిచేటి రామచంద్రాచార్యులు, పొడిచేటి సీతారామానుజాచార్యులు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, కోటి రామ స్వరూప్‌లు, స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


