డిప్యూటీ సీఎం, మంత్రిని కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం, మంత్రిని కలిసిన కలెక్టర్‌

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టర్‌గా నియమితులైన టీఎస్‌ దివాకర ఆదివారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛాలు అందించగా వారు అభినందించారు. అనంతరం కలెక్టర్‌ను మంత్రి తుమ్మల సత్కరించారు.

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ఖమ్మం 16వ డివిజన్‌ ధంసలాపురం కాలనీలో సీసీ డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక రఘునాథపాలెం రైతు వేదికలో జరిగే ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, మంగళవారం ఖమ్మం 18వ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌, శ్రీరామ్‌హిల్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంత్రి హాజరవుతారు.

నేడు ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’

వైరా/రఘునాథపాలెం: పంటల సాగు, విత్తనాల ఎంపిక, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సోమవారం ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ పేరిట కార్యక్రమం నిర్వహించనున్నారు. రఘునాథపాలెంలోని రైతువేదికలో ఉదయం జరిగే కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని వైరా కేవీకే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.పావని తెలిపారు. అలాగే, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఈమేరకు ఏర్పాట్లను డీఏఓ పుల్లయ్య, రఘునాథపాలెం ఏఓ కె.ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఆదివారం పరిశీలించారు.

ముగిసిన

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఆదివారంతో ముగిసినట్లు డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్‌ కూరపాటి మంగపతిరావులు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 918 మందికి గాను 772 మంది హాజరయ్యారని, 146 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో 1,509 మందికిగాను 1,285మంది హాజరు కాగా, 224 మంది గైర్హాజరైనట్లు వివరించారు.

28 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు

ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 28నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

‘దుమ్ముగూడెం’ వద్ద

నిలకడగా గోదావరి

అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం పది రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. గత శుక్రవారం 48.5 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఆనకట్ట సమీపంలో ఉన్న మిషన్‌ భగీరథ ఇంటేక్‌ వెల్‌ నుంచిజిల్లా వ్యాప్తంగా గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా రోజూ 150ఎంఎల్‌డీ నీరు సరఫరా చేస్తారు. భారజల కర్మాగారం ఇంటేక్‌వెల్‌ ద్వారా నీరు సేకరిస్తారు. 49.5 మీటర్లు నీటి మట్టం ఉంటే ఆనకట్ట అలుగుపోస్తుంది. నీటిమట్టం 47 మీటర్ల దిగువకు పడిపోతే తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయి. గతేడాది ఏప్రిల్‌ రెండో వారంలో ఇదే పరిస్థితి ఎదురైతే నీటిపారుదల శాఖ అధికారులు ఎగువ ప్రాంతాల నుంచి నీటిని వదిలారు. పది రోజులుగా నీటిమట్టం నిలకడగా ఉందని ఎగువ ప్రాంతంలోని లక్ష్మి, సమ్మక్క, సాగర్‌ బ్యారేజీల నుంచి కొంత ఇన్‌ఫ్లో ఉన్నందున, ప్రస్తుతానికి తాగునీటికి ఢోకా లేదని మిషన్‌ భగీరథ అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement