● మండల కేంద్రాల్లో 21 కేంద్రాలు ● జిల్లా కేంద్రంలో 23 కేంద్రాల ఏర్పాటు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలో ఈ ఏడాది వేసవిలో క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. శిక్షణ కోసం సీనియర్ పీడీలు, పీఈటీలు, కోచ్‌లను ఏర్పాటు చేశారు. అండర్–14 విభాగం బాలబాలికలకే ఈసారి ప్రాధాన్యత ఇవ్వనుండగా.. ప్రధానంగా ఔత్సాహిక క్రీడాకారులను గుర్తించి మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వేసవి ముగిశాక ఇందులో ప్రతీ క్రీడాంశం నుంచి పది మందిని ఎంపిక చేసి దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
44 శిబిరాలు
ఈ ఏడాది జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో 44 శిక్షణ శిబిరాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో 21 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు. మరో 23 కేంద్రాలను జిల్లా కేంద్రంలో కొనసాగించనున్నారు. ఇందులో కొన్ని మినహా మిగతా అన్ని క్రీడాంశాల్లో ఫీజుల వసూలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి బాల్ బ్యాడ్మింటన్ (బోనకల్), బ్యాడ్మింటన్ శిక్షణను కల్లూరు, వైరా, మధిర స్టేడియంలో ఏర్పాటుచేస్తారు. అలాగే, వాలీబాల్ శిక్షణ శిబిరాలు ముదిగొండ, కల్లూరు, మధిర మినీ స్టేడియంలు, గుదిమళ్ల(ఖమ్మం రూరల్), తిమ్మరావుపేటలో, హ్యాండ్‌బాల్ శిక్షణ కొదుమూరులో, నెట్‌బాల్ శిక్షణకు ఏదులాపురంలో ఏర్పాటుచేయనున్నారు. ఇక ఫుట్‌బాల్ శిక్షణ కోసం మల్లెమడుగు, వీవీపాలెం, కల్లూరు మినీ స్టేడియం, కబడ్డీ శిక్షణ మల్లెమడుగు, కల్లూరు, మధిరలో, నెట్‌బాల్ శిక్షణ బచ్చోడు(తిరుమాలాయపాలెం)లో, ఖో–ఖో శిక్షణ శిబిరం కొదుమూరులో, టేబుల్ టెన్నిస్ శిక్షణకు తల్లాడలో, అథ్లెటిక్స్ కల్లూరులో, యోగా శిక్షణకు అయ్యగారిపేట శిబిరాలు ఏర్పాటుచేస్తారు. అలాగే, ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్కేటింగ్, ఉషూ, టెన్నిస్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, ఖో–ఖో, హ్యాండ్‌బాల్, నెట్‌బాల్, క్రికెట్, హ్యాండ్‌బాల్, తైక్వాండో క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాలు ఉంటాయి. ఇవికాక బాస్కెట్‌బాల్ శిక్షణ పెవిలియన్ గ్రౌండ్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో ఉంటుంది. ఈమేరకు ఔత్సాహిక క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు.


