సాదాబైనామా సమస్యకు త్వరలోనే ముగింపు మంచి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాలు పంచుకోవాలి రాయగూడెం, సుబ్లేడు ప్రజాదర్బార్‌ల్లో మంత్రి పొంగులేటి
ప్రజలకు మేలే
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘పేద ప్రజల సంక్షేమానికి భద్రత, భరోసా కల్పించడమే అజెండాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం పనిచేస్తోంది. సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మేలు చేసే సంకల్పంతో ఉన్నాం.’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం రాయగూడెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామాల్లో శనివారం ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ కార్యక్రమాలను మంత్రి ప్రారంభించి ప్రజల నుంచి వినతులను నేరుగా స్వీకరించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాలకే అధికారులను పంపించి సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతీ వారం ఒక శాఖ ఆధ్వర్యాన గ్రామాల నుంచి అందిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసమే అధికం..
నేలకొండపల్లి మండలంలో వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 55 శాతం ఇందిరమ్మ ఇళ్ల కోసమే అందాయని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఈమేరకు మే నెలలో రెండో విడత, ఆ తర్వాత విడతలవారీగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందిస్తామని తెలిపారు. ధరణి కారణంగా ఏర్పడిన భూ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని, సాదాబైనామా దరఖాస్తులు కూడా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ
ప్రజాదర్బార్ ద్వారా అందిన ప్రతీ దరఖాస్తుకు పరి ష్కారం చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్, రేషన్‌కార్డులు, రోడ్లు, డ్రెయినేజీ వంటి సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కారిస్తామన్నారు. సుబ్లేడులో పోలీస్ స్టేషన్ మంజూరుకు ప్రభుత్వ అనుమతి తీసుకుని త్వరలోనే శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. నేలకొండపల్లి మండలం రాయగూడెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో రాయగూడెం, అజ య్‌తండా, చెరువుమాదారం, మంగాపురంతండా, అప్పల నరసింహాపురం, బుద్ధారం, కట్టుకాచారం, కొంగర, రాజారాంపేట, భైరవునిపల్లి గ్రామపంచా యతీల ప్రజలతో మంత్రి భేటీ అయి వారి సమస్యలు వింటూ వినతులు స్వీకరించారు. కాగా, ప్రజాదర్బార్‌కు అన్ని శాఖల అధికారులు హాజరైనందున వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి పనిచేస్తారని తెలిపారు. సమస్యల్లో అనుకూలమైనవి అక్కడే పరిష్కరిస్తామని, సమయం పడితే అదే విషయాన్ని వివరిస్తామని చెప్పారు. సమస్య న్యాయమైనదైతే.. వ్యక్తిగతంగా ఉపయోగపడినా, గ్రామం, ప్రాంతానికి ఉపయోగపడినా పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. మంచి చేసే అంశంలో అందరూ భాగస్వాములు కావాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, సీఈ సురేష్, ఎన్పీడీసీఎల్ సీఈ రాజుచౌహాన్, డీపీఓ రాంబాబు, డీఆర్‌డీఓ శ్రీరామ్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్లు రాంప్రసాద్, లూథర్ విల్సన్, డీఎల్‌పీఓ విజయలక్ష్మి ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, వ్యవసాయ మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు వి.సీతారాములు, చావా శివరామకృష్ణ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ప్రతీ దరఖాస్తుకు పరిష్కారం చూపుతాం


