గణన.. ఫటాఫట్‌ ! | - | Sakshi
Sakshi News home page

గణన.. ఫటాఫట్‌ !

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

● అందుబాటులోకి ’సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌’ పోర్టల్‌ ● సొంతంగా వివరాల నమోదుకు అవకాశం ● ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్‌కు ఐడీ చెబితే చాలు..

సద్వినియోగం చేసుకోండి..

ప్రారంభం కానున్న జనాభా లెక్కల సేకరణ
● అందుబాటులోకి ’సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌’ పోర్టల్‌ ● సొంతంగా వివరాల నమోదుకు అవకాశం ● ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్‌కు ఐడీ చెబితే చాలు..

ఖమ్మం మయూరిసెంటర్‌: కేంద్రప్రభుత్వం చేపడుతున్న జనాభా లెక్కల సేకరణకు రంగం సిద్ధమైంది. 2027 జనగణన ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్‌ పద్ధతిలో జరగనుంది. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి పదుల సంఖ్యలో ప్రశ్నలు అడుగులూ రాతపూర్వకంగా సమాధానాలు నమోదు చేసుకునేవారు. దీంతో ఒక్కో ఇంట్లో వివరాలు నమోదుకు గంటల తరబడి సమయం పట్టేది. కానీ ఈసారి పూర్తిగా యాప్‌ ద్వారా చేపట్టనున్నారు. దీనికి తోడు ఈసారి ఎవరికి వారే వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ‘సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌’ (స్వయం గణన) సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

రెండు దశల్లో ప్రక్రియ

జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో సాగనుంది. మొదటి దశలో ’హౌస్‌ లిస్టింగ్‌’(ఇళ్ల జాబితా నమోదు) చేపడతారు. ఇందులో ఇంటి యజమాని పేరు, ఇంట్లో ఉన్న సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా గణన జరుగుతుంది. మొదటి దశ ప్రక్రియ వచ్చేనెల 11నుంచి జూన్‌ 9 వరకు జరగనుండగా.. అంతకుముందే స్వీయగణన నమోదుకు అవకాశం కల్పించారు.

నమోదు ఇలా..

జనగణన డిజిటల్‌ పద్ధతిలో జరుగుతుండడంతో ప్రజలు తమ వివరాలను యాప్‌లో నమోదు చేసే అవకాశాన్ని కల్పించారు. ఎన్యుమరేటర్లు ఇంటికి రాకముందే, ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వివరాలు సమర్పించవచ్చు. కుటుంబ యజమాని తన మొబైల్‌ నంబర్‌ ద్వారా se.censes.gov.in పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి. ఒక ఫోన్‌ నంబర్‌ ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం. అంతేకాక యజమాని పేరు ఒకసారి నమోదు చేశాక మార్చడానికి వీలుండదు. ఈమేరకు పోర్టల్‌లో జిల్లా, ల్యాండ్‌మార్క్‌ ఎంచుకున్నాక... మ్యాప్‌పై ఇంటి కచ్చితమైన స్థానాన్ని గుర్తించాలి. ఆపై ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి సబ్‌మిట్‌ చేయాలి. యాజమాని పేరు తప్ప ఇతరత్రా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే(ఎడిట్‌) అవకాశం కూడా ఉంది. ఈ పోర్టల్‌ ఆదివారం నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 6నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

31 ప్రశ్నలు

సెల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆపై రాష్ట్రం, జిల్లా, ప్రాంతం, చిరునామా తదితర వివరాలను పొందుపర్చాలి. అయితే, కచ్చితమైన చిరునామాను గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా కూడా నమోదు చేయొచ్చు. అనంతరం జన గణనకు సంబంధించి మొత్తం 31రకాల ప్రశ్నలు ఉంటాయి. మీరు ఎలాంటి ఇంటిలో ఉంటున్నారు.. సొంతమా, అద్దె గృహమా? ఇంట్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి. కులం, వృత్తి తదితర సమాచారం అందించాలి. ఇందులో 7, 9వ ప్రశ్నలు తప్ప మిగిలిన వాటికి సంబంధించిన వివరాలు నమోదు చేశాక డ్రాఫ్ట్‌లో సేవ్‌ అవుతాయి. మరోసారి అంతా సరిచూసుకుని సక్రమమేనని నిర్ధారించుకున్నాక సబ్‌మిట్‌ చేయొచ్చు.

ఎస్‌ఈ ఐడీ తప్పనిసరి

సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌లో భాగంగా వివరాల నమోదు పూర్తయ్యాక 11 అంకెలతో కూడిన ’సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ఐడీ’ (ఎస్‌ఈ ఐడీ) జనరేట్‌ అవుతుంది. ఇది సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో కూడా వస్తుంది. భవిష్యత్‌లో ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్‌కు ఈ ఐడీ చెబితే వివరాలు మరోమారు చెప్పే అవసరం లేకుండా పని వేగంగా పూర్తవుతుంది. ఆపై వారు వివరాలన్నీ సరిచూసుకుని ప్రభుత్వానికి చేరచేస్తారు.

ప్రభుత్వం జనగణన ప్రక్రియలో వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఖమ్మం నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పోర్టల్‌ను ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఎన్యూమరేటర్లకు మరోసారి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. పోర్టల్‌లో వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, ఎన్యూమరేటర్‌కు ఎస్‌ఈ ఐడీ చెబితే సరిపోతుంది.

– అభిషేక్‌ అగస్త్య, కమిషనర్‌, కేఎంసీ

Advertisement
 
Advertisement
Advertisement