ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు, అర్చకులు సోమయ్య, కృష్ణప్రసాద్, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన న్యాయసేవా సంస్థ కార్యదర్శి
ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా దేవీమానస శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నాలుగో అడిషనల్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమె ఇటీవలే న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఈమేరకు దేవీమానస శనివారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అందించే పథకాలను ప్రజలకు చేరువ అయ్యేలా కృషి చేయడమే కాక కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
దోమలను తరిమేస్తేనే మలేరియా నిర్మూలన
ఖమ్మం మామిళ్లగూడెం: దోమలు పెట్టకుండా, కుట్టకుండా చూసుకోవడం ద్వారా మలేరియా నుంచి రక్షించుకోవచ్చని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం ఖమ్మంలో అర్బన్ మలేరియా విభాగం ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ దోమల పెరుగుదలను అరికట్టడం వల్లే మలేరియాను అంతం చేయగలమని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ బాధ్యతగా భావించి ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జ్వరం, చలి, వణుకు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు వేణుగోపాల్, మహ్మద్ మన్నన్, ఇతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ‘రైతు
ముంగిట్లో శాస్త్రవేత్తలు’
అశ్వారావుపేట: రైతులకు సలహాలు సూచనలు చేసేందుకు వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు 9 బృందాలుగా ఏర్పడి నాలుగు వారాల పాటు రైతుల వద్దకు వెళ్లి అవగాహనా కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు. 72 గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధ అధికారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
రామయ్యకు
సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.


