కలెక్టర్‌గా టీఎస్‌ దివాకర | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా టీఎస్‌ దివాకర

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

● ప్రస్తుత కలెక్టర్‌ అనుదీప్‌ హైదరాబాద్‌కు బదిలీ ● జిల్లాలో సుమారు 11నెలల పాటు విధులు ● ఈసీఆర్‌ విజయం.. భూదాన్‌ వివాదం

● ప్రస్తుత కలెక్టర్‌ అనుదీప్‌ హైదరాబాద్‌కు బదిలీ ● జిల్లాలో సుమారు 11నెలల పాటు విధులు ● ఈసీఆర్‌ విజయం.. భూదాన్‌ వివాదం

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో అనుదీప్‌ కూడా ఉండగా.. ఆయనకు ఐటీఈ అండ్‌ సీ జాయింట్‌ సెక్రటరీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదే సమయాన తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన స్థానంలో ములుగు కలెక్టర్‌గా ఉన్న టీఎస్‌ దివాకరను జిల్లాకు కేటాయించారు.

ఏడాది లోపే..

కలెక్టర్‌గా అనుదీప్‌ గత ఏడాది జూన్‌ 13న జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పర్యవేక్షించారు. ఇందులో భాగంగానే ప్రాథమిక పాఠశాలల పిల్లల కోసం ప్రవేశపెట్టిన ఎవ్రీ ఎవరీ చైల్డ్‌ రీడ్స్‌(ఈసీఆర్‌)తో మంచి ఫలితాలు వచ్చాయి. వేలాది మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ అక్షరాలు మొదలు వాక్యాలు చదివే స్థాయికి చేరుకున్నారు. అంతేకాక ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు. అలాగే, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఫార్మర్‌ రిజిస్ట్రీ అమలుతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇదే సమయాన ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్‌ భూముల్లో ఇళ్ల కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, అక్కడ ఇళ్లు కోల్పోయిన కొందరికి ప్రభుత్వం స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడంతో వివాదం సద్దుమణిగింది.

దివాకర.. ములుగు నుంచి ఖమ్మం

ములుగు కలెక్టర్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న టీఎస్‌ దివాకరను జిల్లా కలెక్టర్‌గా నియమించారు. 2017 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించడం, పరిష్కరించడంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో చురుగ్గా వ్యవహరిస్తారనే గుర్తింపు ఉంది. ముుులుగు జిల్లా కలెక్టర్‌గా ఆసియాలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అంతేకాక అక్కడ గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో వసతుల కల్పన, పనితీరు మెరుగుపర్చడమే కాక ప్రజావాణిలో అందే ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపిస్తూ ప్రజలు మన్ననలు పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement