తిరుమలాయపాలెం: ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం ప్రజల గుమ్మం వద్దకే వస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో 13గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రజాదర్బార్‌లో మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాక మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇబ్బంది రాకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చే దరఖాస్తులకు జవాబుదారీ తనం ఉండేలా రశీదు ఇస్తూ మూడు నెలల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొత్త మండలాల ప్రక్రియ జరిగితే నియోజకవర్గంలోని రెండు ప్రాంతాల్లో ఒక మండలం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, దరఖాస్తులను అక్కడికక్కడే శాఖల వారీగా అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయడమే కాక సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. కాగా, రాయగూడెం ప్రజాదర్భార్‌లో 1,119, సుబ్లేడులో 548 దరఖాస్తులు అందాయి.


