ఇంధనం కొరత! | - | Sakshi
Sakshi News home page

ఇంధనం కొరత!

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

ప్రచారంతో బారులు .. కంపెనీల బాధ్యులతో చర్చిస్తాం..

పెట్రోల్‌, డీజిల్‌ రాకపోవడంతో మూసివేత స్టాక్‌ ఉన్న చోట వాహనదారుల బారులు

ఖమ్మంసహకారనగర్‌: ఇరాన్‌ – అమెరికా యుద్ధ ప్రభావం జిల్లాను తాకినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. జిల్లాలో నాలుగు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడగా.. శుక్ర, శనివారాల్లో మరింత తీవ్రమైంది. బంక్‌లకు ఇంధనం స్టాక్‌ రాకపోవడంతో జిల్లాల్లోని పలుచోట్ల మూసివేశారు. కొన్ని బంక్‌ల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ఉండగా, అక్కడ వాహనదారులు బారులు దీరుతున్నారు.

జిల్లాలో 220 బంక్‌లు

జిల్లాలోని 21 మండలాల పరిధిలో 220 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)తో పాటు ఎస్సార్‌, రిలయన్స్‌ కంపెనీల బంక్‌లు కొనసాగుతున్నాయి. జిల్లా వాహనదారులు రోజువారీగా సుమారు 1.50 లక్షల లీటర్ల పెట్రోల్‌, 3.50 లక్షల లీటర్ల డీజిల్‌ ఉపయోగిస్తున్నట్లు అంచనా. అయితే, ఇరాన్‌ – అమెరికా యుద్ధం కారణంగా గతంలో మాదిరి ఇంధనం సరఫరా కాకపోవడమే కొరతకు కారణమనే ప్రచారం జరుగుతోంది.

కొన్ని మూత.. ఇంకొన్ని చోట్ల క్యూ

గత నాలుగు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా చాలామంది బంక్‌లను మూసివేశారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని బంక్‌ల్లో మాత్రం స్టాక్‌ ఉండగా.. వాహనదారులు క్యూ కడుతున్నారు. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి తదితర ప్రాంతాలతో పాటు నిత్యం రద్దీగా ఉండే కొణిజర్ల, తల్లాడ, పెనుబల్లి, ఏన్కూరు తదితర మండలాల్లోని బంక్‌ల్లో శుక్రవారం ఉదయమే ఇంధనం స్టాక్‌ అయిపోవడంతో నో స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కొన్ని బంక్‌లు తెరిచి ఉన్నా శనివారం సాయంత్రానికి అక్కడ కూడా స్టాక్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడం, మున్ముందు మరింత కొరత ఏర్పడుతుందనే భావనతో శనివారం సాయంత్రం నుంచి వినియోగదారులు క్యూ కట్టారు.

ఏపీ నుంచి కూడా..

తెలంగాణతో పోలిస్తే ఏపీలో నాలుగు రోజుల నుంచి ఇంధనం కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఫలితంగా చాలావరకు బంక్‌లు మూతపడ్డాయని సమాచారం. దీంతో ఏపీ సరిహద్దుగా ఉన్న జిల్లాలోని ప్రాంతాలకు అక్కడి వాహనదారులు వస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని బంక్‌ల్లో కూడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అడుగంటుతున్నాయని తెలిసింది.

సత్తుపల్లిటౌన్‌: జిల్లాలోని పలు బంక్‌ల్లో పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ లేక ఒక్కో బంక్‌ను శుక్రవారం నుంచి మూసివేస్తున్నారు. ఈ విషయమై విస్తృత ప్రచారం జరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సత్తుపల్లిలోని రెండు బంక్‌ల్లో మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ ఉండడంతో శనివారం వాహనదారులు బారులుదీరారు. క్యూ కట్టి మరీ పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకోవడం కనిపించింది. అయితే, యుద్ధం ప్రభావంతో స్టాక్‌ రావడం లేదా, ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు.

జిల్లాలోని చాలావరకు పెట్రోల్‌ బంక్‌ల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందనే అంశం మా దృష్టికి వచ్చింది. కంపెనీల బాధ్యులతో మాట్లాడి కొరతకు కారణాలపై ఆరా తీస్తాం. ఇదే సమయాన జిల్లాకు రోజువారీ డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

–చందన్‌కుమార్‌, డీసీఎస్‌ఓ

జిల్లాలోని పలు బంక్‌ల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

Advertisement
 
Advertisement
Advertisement