ఎన్‌ఎఫ్‌బీఎస్‌ పథకంలో మార్పులు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎఫ్‌బీఎస్‌ పథకంలో మార్పులు

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

● బాధ్యతలు ఎంపీడీఓలకు, కమిషనర్లకు అప్పగింత ● రెవెన్యూ అధికారుల పని ఒత్తిడితో నిర్ణయం

కుటుంబ యజమాని మరణిస్తే దరఖాస్తు

● బాధ్యతలు ఎంపీడీఓలకు, కమిషనర్లకు అప్పగింత ● రెవెన్యూ అధికారుల పని ఒత్తిడితో నిర్ణయం

అశ్వాపురం: కుటుంబంలో పెద్ద దిక్కు.. యజమాని మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌)లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు, నిధుల విడుదల ప్రక్రియ ఇకపై మండలాల్లో ఎంపీడీఓల పరిధిలోకి, మున్సిపాలిటిల్లో కమిషనర్ల పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

తహసీల్దార్‌ కార్యాలయాల్లో పెండింగ్‌

తహసీల్దార్‌ కార్యాలయాల్లో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో వీటి పరిశీలన, ఆమోదం, ప్రభుత్వానికి నివేదించడం అంతా రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉండేది. రెవెన్యూ అధికారులు పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయిలో విచారణలోనూ, నిధుల విడుదలలోనూ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో బాధ్యతలను ఎంపీడీఓలు, పురపాలికల కమిషనర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల ద్వారా వచ్చే దరఖాస్తులను ఎంపీడీఓలు పరిశీలించి త్వరితగతిన నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటారు.

18 నుంచి 60 ఏళ్ల లోపు..

ఈ పథకం కింద అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి మృతి చెంది ఉండాలి. లబ్ధిదారులు స్థానిక గ్రామ పంచాయతీల ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పంచాయతీ కార్యదర్శుల ద్వారా విచారణ వేగవంతంగా జరిగే అవకాశం ఉంది.

కుటుంబ యజమాని మరణిస్తే ఎన్‌ఎఫ్‌బీఎస్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉంటే పథకం ద్వారా ఆర్థికసాయం అందజేస్తాం. ఈ పథకం బాధ్యతలు ఇటీవల ప్రభుత్వం ఎంపీడీఓలకు అప్పగించింది. అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– ముత్యాలరావు, ఎంపీడీఓ, అశ్వాపురం

Advertisement
 
Advertisement
Advertisement