ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ బిల్లుల చెల్లింపునకు డిస్కంలు రూపొందించిన ఆన్‌లైన్ విధానానికి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండడంతో కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా ఇంటి వద్ద ఉండే బిల్లులు చెల్లిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వాలు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తుండడం మరో కారణంగా తెలుస్తోంది. గతంలో విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఆ శాఖ కార్యాలయాలు, కౌంటర్ల వద్ద వినియోగదారులు బారులు దీరేవారు. ప్రసుత్తం చాలామంది ఆన్‌లైన్‌లో చెల్లిస్తుండడంతో కౌంటర్లు వెలవెలపోతున్నాయి.
గతంలో పోలిస్తే ౖపైపెకి...
టీజీఎన్పీడీసీఎల్ యాప్, టీ వ్యాలెట్, గూగుల్ పే, ఫోన్‌పే తదితర డిజిటల్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. 2024–25 ఆర్దిక సంవత్సరంలో జిల్లాలోని 14,18,030 మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య 17,03,813కు చేరింది. అంటే ఏడాది కాలంలో చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 3లక్షలు పెరగడం విశేషం. ఏటా వేసవిలో బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిషయమై ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడుతూ విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించడం సురక్షితంగానే కాక పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా వినియోగదారులు కౌంటర్ల వద్ద ఇబ్బంది పడకుండా ఆన్‌లైన్‌లో చెల్లించడంపై దృష్టి సారించాలని సూచించారు.
క్రమక్రమంగా పెరుగుతున్న చెల్లింపులు


