వంతెనపై ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

వంతెనపై ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపు

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని చర్చి కంపౌండ్‌ వంతెనపై మరమ్మతుల దృష్ట్యా రాకపోకలను వన్‌ వేలో అనుమతించనున్నట్లు ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. చర్చి కాంపౌండ్‌ నుంచి ప్రకాష్‌నగర్‌ వైపు వన్‌ వే అమలు కానున్నందున, వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు వెంకటగిరి క్రాస్‌ నుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లను కోదాడ క్రాస్‌, బైపాస్‌ వైపు మళ్లిస్తామని తెలిపారు. అలాగే, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రకాష్‌నగర్‌లోని కొత్త పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం, బోస్‌ బొమ్మ సెంటర్‌, గాంధీ చౌక్‌, పీఎస్‌ఆర్‌ రోడ్డు, నయాబజార్‌ వైపు వెళ్లాలని సూచించారు. ఇక ముదిగొండ నుండి ఖమ్మం వచ్చే వాహనదారులు వెంకటగిరి క్రాస్‌ వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే మీదుగా వస్తూ ధంసలాపురం ఎగ్జిట్‌ దగ్గర దిగి శ్రీరామ్‌హిల్స్‌, ముస్తఫానగర్‌ మీదుగా ఖమ్మం చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఏటీసీ కోర్సులతో

ఉపాధి అవకాశాలు

ఖమ్మం మామిళ్లగూడెం: అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)లోని కోర్సులు పూర్తిచేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు తెలిపారు. సంక్షేమ వా రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంక్షేమ శాఖల అధికారులు గ్రేసమ్మ, వెంగల్‌రావు, ఎం. వీరన్న, ఎండీ.అబ్దుల్‌ రవూఫ్‌ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు అదనపు కోర్సులు పూర్తిచేస్తే నైపుణ్యాలు పెరిగి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈకార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీలత, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ రావు పాల్గొన్నారు.

27న ‘నిధి ఆప్‌కే నికట్‌’

ఖమ్మం సహకారనగర్‌: సంస్థల యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈనెల 27న ‘నిధి ఆప్‌కే నికట్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ప్రాంతీయ కమిషనర్‌ వై.డీ. శ్రీనివాస్‌ తెలిపారు. సత్తుపల్లిలోని మున్సిపాలిటీ కార్యాలయంలో 27న ఉదయం 9–30నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, యజమానులు, పెన్షనర్లకు సంస్థ ద్వారా అందుతున్న సేవలపై అవగాహన కల్పించడమే కాక సమస్యల పరిష్కారంపై సూచనలు చేస్తామని వెల్లడించారు.

లాటరీ పేరిట

రూ.1.50లక్షలకు టోకరా

కారేపల్లి: తక్కువ ధరలకే సబ్బులు ఇస్తాం.. సబ్బులు కొనుగోలు చేసిన వారు లక్కీ లాటరీలో రూ.లక్షలు గెలుచుకోవచ్చని ఓ వ్యక్తి మాయమాటలు చొప్పి రూ.1.50లక్షల మేర వసూలు చేసిన ఘటన మండలంలోని గాదెపాడులో వెలుగు చేసింది. ఏపీకి ఓ వ్యక్తి ఇటీవల గాదెపాడుకు రా గా, తక్కువ ధరతో నాణ్యమైన సబ్బులు విక్రయిస్తున్నట్లు నమ్మబలికాడు. అంతేకాక సబ్బులు కొన్న వారు లాటరీలో రూ.లక్షలు బహుమతిగా గెలుచుకోవచ్చని తెలిపాడు. దీంతో పలువురు సబ్బులు కొనుగోలు చేయగా ఫోన్‌నంబర్లు తీసుకుని వెళ్లిపోయాడు. ఆతర్వాత ఫోన్‌ చేసి లాటరీ తగిలిందని చెబుతూ రూ.20వేలు, రూ.30వేల చొప్పున ఫోన్‌పే ద్వారా డిపాజిట్‌ చేస్తే రూ.లక్ష ఖాతాలో జమ అవుతుందని చెప్పడంతో పలు వురు రూ.1.50లక్షల మేరచెల్లించారు.కానీ డబ్బు జమ కాకపోగా, సదరు వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో మోసపోయామని గుర్తించారు. దీంతో గ్రామానికి చెందిన రాయల మాధవరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.గోపి తెలిపారు.

ప్రమాద ఘటనపై

కేసు నమోదు

చింతకాని: రోడ్డుప్రమాదానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశా రు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన పెనుగొండ తిరుపతిరావు ఈనెల 13వ తేదీన ద్వి చక్ర వాహనంపై పందిళ్లపల్లి వెళ్తున్నాడు. ఇదేసమయాన ఖమ్మం వైపు నుండి ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చిన నిఖిల్‌ జగన్నాధపురం సమీపాన తిరుపతిరావు వాహనాన్ని ఢీకొట్టాడు. ఘటనలో తిరుపతిరావుకు తీవ్ర గాయాలు కాగా ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్‌ తరలించారు. ఈమేరకు ఆయన తల్లి జ్యోతి ఫిర్యాదుతో నిఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement