ఆర్టీసీని దిగజారుస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని దిగజారుస్తున్న ప్రభుత్వం

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

ఖమ్మం మామిళ్లగూడెం: ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచన దుర్మార్గమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. ఈమేరకు ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల తలరాతలు మారకపోగా, సంస్థ ప్రైవేటీకరణ కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని కేసీఆర్‌ ప్రభుత్వం నాశనం చేస్తే.. ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరింత దిగజారుస్తోందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీసీ సమస్యలపై గొంతెత్తిన రేవంత్‌రెడ్డి, కోదండరామ్‌ వంటి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమనేది ప్రభుత్వ పథకమైనందున పూర్తి భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప ఆర్టీసీ నెత్తిన రుద్దడం సరి కాదని పేర్కొన్నారు. జిల్లా నుంచి మంత్రులు ఉన్నా ఆర్టీసీ కార్మికుల సమ్మె, వారి సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

శాశ్వత పరిష్కారానికి యత్నం

దేశ చరిత్రలో మహిళా సాధికారతకు బాటలు వేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు ఒక సువర్ణ అధ్యాయమే కాక కీలక అడుగుగా నిలిచిందని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గత 27 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ అంశానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేశారని చెప్పారు. దీనిని ప్రతిపక్షాలు కేవలం రాజకీయ కోణంలో కాకుండా సామాజిక మార్పుగా చూస్తే బాగుండేదని అన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన మా ట్లాడుతూ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ వైఖరి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన రోజు తేలిపోయిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, నాయకులు గోంగూర వెంకటేశ్వరరావు, వి.పుల్లారావు యాద వ్‌, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్‌, గుత్తా వెంకటేశ్వర్లు, వేరెల్లి రాజేష్‌, రవిరాథోడ్‌, నకరికంటి వీరభద్రం, రవిగౌడ్‌, దొడ్డా అరుణ, అత్తి విజయరెడ్డి, అనిత, రజినీరెడ్డి, స్వర్ణకుమారి, మందా సరస్వతి, మణి, ఫణికుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement