భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ అధికారులు చేపట్టిన మార్కింగ్ ప్రక్రియను శుక్రవారం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆలయం చుట్టూ ప్రభుత్వం సేకరించిన భూమి, మాఢ వీధుల విస్తరణపై ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ కోసం గతంలోనే నిబంధనల ప్రకారం భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు పరిహారం అందించామని తెలిపారు. సేకరించిన భూమిని పంచనామా నిర్వహించి దేవాదాయ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ.351 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయని ఆయన వివరించారు.
కేరళ మోడల్
అంగన్‌వాడీ పరిశీలన
పాల్వంచరూరల్: మండల పరిధిలోని తోగ్గూడెంతండాలో నీతి అయోగ్ నిధులు రూ.15 లక్షలతో కేరళ మోడల్‌లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ డి.సాయిబాబు సందర్శించి పరిశీలించారు. భవన సమూదాయ ప్రయోజనాలు, కేంద్రంలో ఆరోగ్యం, విద్య, పోషణ, ప్రాథమిక వసతులపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆటవస్తువులు అందుబాటులో ఎందుకు ఉంచలేదని సిబ్బందిని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బొగ్గనారాయణ, ఎంపీఓ కేశవరావు, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.


