నేలకొండపల్లి: ఇంకొకరి వద్ద కొనుగోలు చేయడం.. ఆపై రవాణా ఇక్కట్లు, మళ్లీ అధికారుల కన్నుగప్పి అమ్మాలంటే తిప్పలు.. ఇవన్నీ ఎందుకుని భావించాడో, ఏమో కానీ ఓ వ్యక్తి ఇంట్లోనే నల్లబెల్లం తయారీకి శ్రీకారం చుట్టాడు. ఆపై బెల్లాన్ని గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నాడు. ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ బృందం, నేలకొండపల్లి స్టేషన్ ఉద్యోగులు గురువారం రాత్రి నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలోని బొమ్మిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో చేపట్టిన ఈ తనిఖీల్లో విషయం బయటపడింది. సదరు వ్యక్తి నల్లబెల్లం తయారీ చేసి గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈమేరకు శ్రీనివాస్ ఇంట్లో నల్లబెల్లం తయారీకి ఉపయోగిస్తున్న ముడిపదార్ధాలతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న 1,944 కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఈఎస్ వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుడుంబా తయారీకి కావాల్సిన పదార్థాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డీటీఎఫ్ సీఐ కరుణశ్రీ, నేలకొండపల్లి సీఐ రమేష్, ఎస్సై లత, ఉద్యోగులు పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో 1,944 కిలోల బెల్లం స్వాధీనం


