ముగ్గురు మంత్రులు ఉండి రైతులను ఇబ్బంది పెడతారా? మహాధర్నాలో మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మొక్కజొన్న, వరి అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించినా.. ప్రభుత్వం తీరుతో వారిలో ఆనందం లేకుండా పోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఆంక్షలు లేకుండా మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ఽమహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నాడు మఖ్యమంత్రిగా కేసీఆర్ చివరి గింజ వరకు కొనుగోలు చేయడమే కాక రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ అమలుచేశారని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పంట ఉత్పత్తులు కొనుగోలు చేయకపోగా పథకాలను కూడా సక్రమంగా అమలుచేయడం లేదని ఆరోపించారు. పంట కొనుగోళ్ల తీరును పరిశీలిస్తే పార్టీలు మారడం తప్ప మంత్రి తుమ్మలకు ఎలాంటి అనుభవం లేదని రైతులు అంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల గోడు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈమేరకు జిల్లా ప్రజలు ప్రభుత్వం తీరును గుర్తించి కేసీఆర్‌ను మరోమారు సీఎంగా చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే...
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. రాష్ట్రంలో ఎండలు మండుతుంటే మొక్కజొన్నలో తేమ ఉందని క్వింటాకు 5 కేజీలు తరుగు తీయడం దారుణమన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేసేందుకు అనేక పథకాలు అమలుచేశారన్నారు. కానీ కాంగ్రెస్ కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి అసలు రైతులకే ఇవ్వడం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పంటను పండించినా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులు ఉసురు తీసుకుంటుందని మండిపడ్డారు. అత్యధిక దిగుబడి వచ్చినా కొనుగోళ్ల ప్రణాళికా లేక ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అనంతరం అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరుతూ నాయకులు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలోమాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజుయాదవ్, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, బచ్చువిజయ్‌కుమార్, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, కూరాకుల వలరాజు, బెల్లం వేణు, షేక్‌షకీనా, ఆరెంపుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు


