వైరా: వైరాలో రిజర్వాయర్ కాల్వ వద్ద ప్రమాదాలు జరగకుండా కరకట్ట వెంట ఫెన్సింగ్ ఏర్పాటుకు మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించింది. ఈమేరకు 6, 9వ వార్డుల్లోని ఇందిరమ్మ కాలనీ పక్కనే రిజర్వాయర్ కాల్వకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈక్రమాన మున్సి పల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, మున్సి పల్ ఏఈ శ్రీమాన్య శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చైర్మన్ కట్ల సంతోష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గుగులోత్ వీరన్న, నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు మెరుగుపడాలి
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్ సమస్యలను పరిష్కరించి, వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించాలని టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సభ్యులు కోరారు. ఖమ్మంలోని ఎంపీ రఘురాంరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీఏసీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, రంజిత్‌నాయక్, మచ్చా రామారావు, సత్యనారాయణరెడ్డి తదితరులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కూసుమంచి, బోనకల్, చింతకాని మండలాలతో పాటు గోవిందాపురం, వైరా, బ్రాహ్మణపల్లి, ఉప్పలమడక, ఖమ్మం రూరల్ మండలం కస్నాతండా, ఖమ్మంలోని ఇందిరానగర్, గోశాల ప్రాంతాల్లో నెట్‌వర్క్ పరిధి విస్తరణ, సమస్యల పరిష్కారానికి మరిన్ని టవర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఖమ్మం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో సిమ్‌కార్డులు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. టీఏసీ సభ్యుల విజ్ఞప్తులపై సంస్థ డీజీఎం రాజశేఖర్, ఏజీఎం స్పందిస్తూ అవసరమైన చోట కొత్త టవర్లు ఏర్పాటుచేస్తామని, ఎంపీ రఘురాంరెడ్డి సూచనలతో పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీ
వేగవంతం చేయాలి
ఎర్రుపాలెం: రైతుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ(ఫార్మర్ రిజిస్ట్రీ)లో వేగం పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆదేశించారు. మండలంలోని కాచారం, ఎర్రుపాలెంల్లో పంటలను పరిశీలించిన ఆయన రైతులంతా వివరాలు నమోదు చేసుకునేలా ఏఈఓలు అవగాహన కల్పించాలని సూచించా రు. ఆతర్వాత డీఏఓ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందడమే కాక వచ్చే సీజన్‌లో యూరియా బుకింగ్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి చెప్పారు. తద్వారా 11 అంకెల రైతు గుర్తింపు సంఖ్య లభి స్తుందని చెప్పారు. ఎర్రుపాలెం మండలంలో ఇంకా 2,622 రైతులు మిగిలినందున మీ సేవా కేంద్రాల్లో లేదా ఏఈఓలను సంప్రదించాలని డీఏఓ తెలిపారు. ఏఓ బోయినపల్లి సాయిశివ, ఏఈఓలు బాలకృష్ణ, వంశీ పాల్గొన్నారు.
‘ఉద్యమ్’ రిజిస్ట్రేషన్
తప్పనిసరి
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా వ్యాపారులు తమ ఆధార్ నంబర్‌ను ‘ఉద్యమ్’ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరని మెప్మా పీడీ నళిని పద్మావతి తెలిపారు. రిజిస్ట్రేషన్ విధానంపై మెప్మా అధికారుల భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాపారులకు సులువుగా రుణాలు మంజూరవుతాయని తెలిపారు. ఈ విషయమై మహిళా సంఘాల్లోని సభ్యులకు ఆర్పీలు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో టీఎంసీ జి.సుజాత, సీఓలు సల్మా, ఉపేంద్ర, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.


