మొక్కజొన్న చేను దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న చేను దగ్ధం

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

నేలకొండపల్లి: మండలంలోని గువ్వలగూడెంలో గురువారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న చేను దగ్ధమైంది. గ్రామంలో రైతు గురవయ్య సాగు చేస్తున్న మొక్కజొన్న చేనులో మంటలు చెలరేగి కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో దాదాపు రెండు ఎకరాల చేను దగ్ధమైందని బాధిత రైతు వెల్లడించాడు.

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌ : మహిళ మృతి

కామేపల్లి: ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్ల్యక్షం కారణంగా ఓ మహిళ ప్రాణాలు పోయాయి. ఈ ఘటన మండలంలోని పాతలింగాల స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన వేముల గోవింద్రరాజు – భాగ్యమ్మ (35) దంపతులు ద్విచక్రవాహనంపై కూలీ పని నిమిత్తం వెళ్తున్నారు. పాతలింగాల చెరువు నుంచి మట్టి లోడ్‌ చేసుకుని, ట్రాక్టర్‌ను డ్రైవర్‌ మడ్డి వేణుబాబు అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో వెనుక కూర్చున్న భాగ్యమ్మ ఎగిరిపడగా, ఆమె తలపై నుంచి ట్రాక్టర్‌ ఇంజన్‌ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గోవింద్రరాజు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా, భాగ్యమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించకుండా ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు మధ్యాహ్నం వరకు ఘటనాస్థలివద్ద నిరసన తెలిపారు. దీంతో సీఐ సాగర్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌ చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు.

కారేపల్లి సబ్‌ పోస్టాఫీస్‌లో చోరీకి యత్నం

కారేపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు కారేపల్లి సబ్‌ పోస్టాఫీస్‌లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్న సబ్‌ పోస్టాఫీస్‌ ప్రధాన ద్వారం తాళాన్ని బుధవారం అర్ధరాత్రి పగులగొట్టిన దుండగులు లోనకు ప్రవేశించారు. ఆపై బీరువా పగలకొట్టి చూడగా విలువైన వస్తువులు లభించకపోవడంతో సుత్తి, కటింగ్‌ మిషన్‌, స్క్రూ డ్రైవర్‌ ఆధారంగా లాకర్‌ (క్యాష్‌ చెస్ట్‌)ను తెరిచేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, లాకర్‌ తెరుచుకోకపోవడంతో టేబుల్‌లో ఉన్న కాస్త చిల్లర తీసుకుని వెళ్లినట్లు సమాచారం. గురువారం ఉదయం వచ్చిన సిబ్బంది చోరీ జరిగిందని గుర్తించగా, సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్‌ఐ బి.గోపి సిబ్బందితో చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement