అస్తిత్వ పోరాటం | - | Sakshi
Sakshi News home page

అస్తిత్వ పోరాటం

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

సబ్సిడీకి మంగళం..

లక్ష్యాల మేర విత్తనాలు విక్రయించలేని దైన్యం ఇదే అదునుగా దూసుకొస్తున్న ప్రైవేట్‌ సంస్థలు ఫలితంగా కల్తీ విత్తనాలతో రైతులు విలవిల

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒకప్పుడు విత్తన భాండాగారంగా పేరుగాంచిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నేడు అస్తిత్వ పోరాటం చేస్తోంది. రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలను అందిస్తూ అండగా నిలవాల్సిన ప్రభుత్వ సంస్థ.. సబ్సిడీల ఎత్తివేతతో క్రమంగా నిర్వీర్యమవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్‌ కంపెనీలు గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తూ నకిలీ, కల్తీ దందాకు తెర లేపుతున్నాయి. ఇవికాక సబ్సిడీలు లేక రైతులు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. కొన్ని కంపెనీలు తక్కువ ధరతో విత్తనాలను విక్రయిస్తున్నా అవి నాణ్యమైనవి కాకపోవడంతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నారు. వచ్చే వానాకాలం నాటికై నా సంస్థపై ప్రభుత్వం దృష్టి సారిస్తే జిల్లా రైతాంగానికి మేలు జరగనుంది.

పంట ఉత్పత్తుల కోసం...

డిమాండ్‌కు తగిన విధంగా పంటల సాగుకు వీలుగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రాంతాల వారీగా శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలతో రైతులను ప్రోత్సహించి విత్తనోత్పత్తిని కూడా చేయిస్తోంది. వరిలో సాంబమసూరి తదితర రకాలను కొందరు రైతులతో నిర్ణీత విస్తీర్ణంలో విత్తనోత్పత్తి కోసం సాగు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ విస్తీర్ణంలో 28 క్వింటాళ్ల దిగుబడి వస్తే విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ తర్వాత విత్తనాలుగా రైతులకు విక్రయిస్తుంది. తద్వారా రైతులందరూ అధిక దిగుబడి సాధించడం సాధ్యమయ్యేది.

ప్రైవేట్‌ కంపెనీల హవా

సబ్సిడీలు ఎత్తివేయడంతో మార్కెట్‌లోకి ప్రైవేట్‌ కంపెనీలు దూసుకొచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువకు విత్తనాలను విక్రయిస్తున్నాయి. 30 కేజీల వరి విత్తనాల బ్యాగ్‌ ప్రభుత్వం రూ.1,100గా ధర నిర్ణయిస్తే.. ప్రైవేట్‌ కంపెనీలు రూ.1,050కే అందిస్తున్నాయి. దీంతో రైతులంతా అటే మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలోనే కొందరు నకిలీ, కల్తీ విత్తనాలను కూడా విక్రయిస్తూ రైతులను ముంచుతున్నారు. ఈ యాసంగి సీజన్‌లో సత్తుపల్లి ప్రాంతంలో పలువురు వరి సాగు చేసిన రైతులు, ఇంకొందరు మొక్కజొన్న రైతులు కూడా నష్టపోయారు.

నష్టాల ఊబిలో సంస్థ..

ఓవైపు సబ్సిడీలు ఎత్తివేయడం, ప్రైవేట్‌ కంపెనీలు రంగంలోకి దిగడంతో విత్తనాభివృద్ధి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంస్థ ద్వారా అమ్మే విత్తనాలకు సబ్సిడీ లేక ధర పెరగడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన, మేలైన విత్తనాలని తెలిసినా ప్రైవేట్‌ కంపెనీలు అంతకంటే ధర తగ్గిస్తుండడంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు, విక్రయ కేంద్రాలు, విత్తనోత్పత్తి చేసే యంత్రాలు ఉన్నా అమ్మకాలు తగ్గడంతో సంస్థ పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. అమ్మకాలు లేక వరి, పప్పుధాన్యాల విత్తనాల నిల్వలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా కొంతైనా నష్టాలను పూడ్చుకునేందుకు సీజన్‌ అయిపోగానే సీడ్‌ను నాన్‌ సీడ్‌గా మార్చి తక్కువ ధరకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇకనైనా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీపై విత్తనాల విక్రయానికి ప్రభుత్వం దృష్టి సారిస్తే అటు సంస్థకు, అటు రైతులకు మేలు జరగనుంది.

విత్తనాభివృద్ధి సంస్థ లోగో

రైతులకు అండగా నిలిచేలా విత్తనాభివృద్ధి సంస్థ సబ్సిడీపై పీఏసీఎస్‌ల ద్వారా విత్తనాలను అందించింది. వరి కిలోకు రూ.5, అపరాల పంటలైన పెసర, కంది, మినుము, సోయాబీన్‌ వంటి పంటలకు రూ.50 శాతం సబ్సిడీ అమలయ్యేది. వేరుశనగ వంటి నూనె గింజల పంటలకు సైతం ప్రభుత్వం సబ్సిడీలను ఇచ్చింది. 2020 ఏడాది వరకు సాఫీగానే సాగిన ఈ ప్రక్రియ ద్వారా రైతులకు తక్కువ ధరతో నాణ్యమైన విత్తనాలు లభించేవి. కానీ ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీలను ఎత్తేయడంతో బహిరంగ మార్కెట్‌లో ఏది నాణ్యమైన విత్తనమో తెలుసుకునే అవకాశం రైతులకు ఉండడం లేదు.

సబ్సిడీల తొలగింపుతో కునారిల్లుతున్న విత్తనాభివృద్ధి సంస్థ

Advertisement
 
Advertisement
Advertisement