బందోబస్తును పరిశీలించిన సీపీ
● రెండో రోజు డిపోల వద్ద కార్మికుల నిరసనలు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బస్సులు నడిపిన అధికారులు ● ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
ఖమ్మంమయూరిసెంటర్: డిమాండ్ల పరి ష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు విధులను బహిష్కరించి అన్ని డిపోల వద్ద నిరసన తెలపడమే కాక బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం డిపో వద్ద నిరసనకు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూని యన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించే వరకు వెనకడుగు వేసేదిలేదని స్పష్టం చేశారు. కార్మికులకు బీఆర్‌ఎస్ జిల్లా, నగర అధ్యక్షులు తాత మధుసూదన్, పగడాల నాగరాజు తదితరులు మద్దతు తెలిపి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికుల ఆందోళనలతో డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రత్యామ్నాయ వ్యూహాలు
కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దనే భావనతో అధికారులు తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. ఈక్రమాన ఖమ్మం డిపో నుండి బుధవారం అర్ధరాత్రి దాటాక 32 బస్సులను కొత్త, పాత బస్టాండ్‌కు చేర్చారు. ఇందులో ఆర్టీసీ బస్సులు 32, అద్దె వాహనాలు 63 బస్సులను గురువా రం వివిధ రూట్లలో తిప్పారు. అలాగే, రీజి యన్‌లో మొత్తం 479 బస్సులకు గాను అధికా రులు 351 బస్సులను నడిపించారు.
ప్రయాణికుల అవస్థలు
అధికారులు కొన్నిరూట్లలో పరిమిత సంఖ్యలోనే బస్సులు నడిపించగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా హైదరాబాద్ వంటి ప్రధాన రూట్లలో బస్సులు లేక ప్రైవేటు వాహనాలు, రైళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక నల్లగొండ, వరంగల్, మిర్యాలగూడ, విజయవాడ రూట్లలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచి ఉన్నారు. బస్సులు నడిచిన రూట్లలోనూ ప్రైవేట్ డ్రైవర్లు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మంక్రైం: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యాన ఖమ్మం కొత్త బస్టాండ్‌ను పోలీసు కమిషనర్ సునీల్‌దత్ పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. బస్సులు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ప్రైవేట్ డ్రైవర్లకు రక్షణ కల్పిస్తామని, నిర్భయంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఏసీపీ రమణమూర్తి, టూటౌన్ సీఐ బాలకృష్ణ పాల్గొన్నారు.


