అంతా పెద్దాస్పత్రి బాటే..
ప్రసవాలు పెంచేలా చర్యలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రసవాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నిత్యం 20 నుంచి 25 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. దీంతో ఎంసీహెచ్ వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో కూడా ప్రసవాలు పెంచాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. అక్కడ సరైన వసతులు, సౌకర్యాలు, పరికరాలు లేకపోవడం, వైద్యుల కొరతతో ప్రసవాలు జరగడం లేదని చెబుతున్నారు. అయితే సరైన దృష్టి సారిస్తే కింది స్థాయి ఆస్పత్రుల్లోనూ ప్రసవాలు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. జిల్లాలో పెద్దాస్పత్రి తర్వాత వైద్య విధాన పరిషత్‌కు చెందిన సత్తుపల్లి, పెనుబల్లి, వైరా, మధిర, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు ఆస్పత్రులకు పేషెంట్లు ఎక్కువగా వస్తున్నా.. ఆయా ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉందని ఇటీవల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో ఈ ఏడు ఆస్పత్రుల్లో కలిపి 74 ప్రసవాలు మాత్రమే జరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై నెలకు కనీసం 200 ప్రసవాలు చేయాలని ఆదేశించారు.
ఉద్యోగులను కేటాయించినా అదే తీరు..
జిల్లాలో పలు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేశారు. మధిర, సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వైరాలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉండగా, కల్లూరులో 30, పెనుబల్లిలో 50 పడకల ఆస్పత్రులు పూర్తయ్యాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. కాగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వెళ్లిన తర్వాత అందులోని వైద్యులు, సిబ్బందిని జిల్లాలోని ఏడు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో సర్దుబాటు చేశారు. అందులో 10 మంది గైనకాలజిస్టులు కూడా ఉన్నారు. ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులున్నా.. వీవీపీ ఆస్పత్రుల్లో ప్రసవాలు మాత్రం పెరగడం లేదు. ఆయా ఆస్పత్రుల్లో సదుపాయాల లేమి ఒక కారణమైతే, ఖమ్మం పెద్దాస్పత్రిలో అన్ని వసతులు ఉంటాయనే భావనతో ఎక్కువ మంది ఇక్కడికే వస్తున్నారు. దీంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం సరిపోవడం లేదు. ప్రస్తుతం మూడంతస్తుల్లో 150 పడకలు ఉండగా మరో ఫ్లోర్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు.
సింహభాగం ప్రసవాలు ఇక్కడే..
జిల్లాలో 20 పీహెచ్‌సీలు, 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు ఉన్నా ఎక్కువ ప్రసవాలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనే జరుగుతున్నాయి. పెద్దాస్పత్రిపై ఒత్తిడి తగ్గించి, మిగతా ఆస్పత్రుల్లో ప్రసవా ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు ఎంసీహెచ్‌లో 2,605 డెలివరీలు జరగగా, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులన్నీ కలిపి 305 ప్రసవాలు మాత్రమే జరిగాయి. చాలా ఏళ్లుగా ఇదే వ్యత్యాసం కనిపిస్తున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వారు సైతం పెద్దాస్పత్రికే వచ్చి డెలివరీలు చేయించుకుంటున్నారు. స్థానికంగా ఉండే వీవీపీ ఆస్పత్రులకు వెళితే వ్యయప్రయాసలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తే వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు చేపట్టాం. గతంలో కంటే ప్రస్తుతం ఏడు ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగయ్యాయి. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. ప్రసవాలకు అవసరమైన వసతులు కూడా ఉన్నాయి. గర్భిణులు దగ్గరలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ రాజశేఖర్‌గౌడ్,
జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి
అంతా పెద్దాస్పత్రి బాటే..


