ముంపు నుంచి రక్షణకు రూ.100 కోట్లు
ఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగరాన్ని గతేడాది తీవ్రంగా ప్రభావితం చేసిన మున్నేరు వరద ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వరద నియంత్రణ, నివారణ చర్యల కోసం రూ.6,190 కోట్ల విడుదలకు జలశక్తి మండలి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జిల్లాకు నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది వరదలతో ములుగు, కొత్తగూడెం, రామగుండం, భూపాలపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో భారీ నష్టాలు సంభవించాయి. వరద నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికల ఆధారంగా కేంద్రం ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక కింద నిధులు కేటాయించింది. ఖమ్మంలో మున్నేరు వరద ముప్పును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఇటీవల జలవనరుల శాఖ అధికారులు ప్రకాశ్‌నగర్ వంతెన నుంచి నేషనల్ హైవే వంతెన వరకు సర్వే నిర్వహించి రిటైనింగ్ వాల్ పొడిగింపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర జలశక్తి మంజూరుచేసిన రూ.100 కోట్లను ఈ ప్రతిపాదిత పనుల కోసం వినియోగించనున్నారు. మొదట ధంసలాపురం కాలనీ వైపు శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నిధులతో మున్నేరు పరిధిలో రిటైనింగ్ వాల్ పొడిగింపు, డ్రెయినేజీ మార్గాల అభివృద్ధి, వరద నీరు తక్షణం నదిలోకి చేరేలా పనులు చేపట్టనున్నారు.
నిధులు మంజూరు చేసిన
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ


