ఉద్యాన అధికారికి రైతు నేస్తం అవార్డు
ఖమ్మంవ్యవసాయం: ఉద్యాన పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించిన వైరా ఉద్యాన అధికారి డాక్టర్ ఆకుల వేణు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతునేస్తం అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఆదివారం రైతునేస్తం అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ప్రతీ సంవత్సరం తెలుగు రాష్ట్రాల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఈ అవార్డులను అందజేయడం ఆనవాయితీ. కాగా, వేణుకు అవార్డు రావడం పట్ల జిల్లాలోని ఉద్యాన, వ్యవసాయాధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
నేడు డీఆర్‌ఎం పర్యటన
మధిర: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ సోమవారం మధిర రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఆ తర్వాత పందిళ్లపల్లిలో ఇటీవల నిర్మించిన గూడ్స్ షెడ్‌ను, మధిరలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎర్రుపాలెం వెళ్లి రైల్వేస్టేషన్ పరిశీలించిన అనంతరం అమరావతిలోని నంబూరు వరకు నూతనంగా నిర్మించనున్న రైల్వేలైన్ పనులపై సమీక్ష నిర్వహించనున్నారు.
రేక్ పాయింట్‌కు చేరిన యూరియా
చింతకాని : మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 2,512.80 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ ఈ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,052.80 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 710 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 550 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీ కి 200 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు.
టెట్ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్
ఖమ్మం సహకారనగర్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి, డీఎస్సీలో ప్రతిభ కనబరిచి, గత 20 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్నవారు మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, భాషా పండితుల, పీఈటీల అప్‌గ్రేడేషన్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.వి.నాగేశ్వరరావు, టి.వెంగళరావు, నాయకులు ఆళ్ల రామారావు, ముత్తయ్య, రమాదేవి, కె.వి, వీరబాబు, మల్ల య్య, నాగిరెడ్డి సంధ్యరాణి, ఉమాదేవి, ఆకుల నాగేశ్వరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
అలరించిన
‘మమ్మల్ని బతకనివ్వండి’
ఖమ్మం గాంధీచౌక్ : నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ప్రదర్శించిన ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటిక ప్రేక్షకులను అలరించింది. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై రూపొందించిన నాటిక అందరినీ ఆలోచింపజేసింది. వరదలు సంభవించిన సమయంలో ఓ వృద్ధ దంపతులు పడిన పాట్లపై రూపొందించిన ఈ నాటికను విజయవాడ సాంస్కృతిక సమితి కళాకారులు ప్రదర్శించారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఏఎస్ కుమార్, మోటమర్రి జగన్మోహన్‌రావు, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, సదానందం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన అధికారికి రైతు నేస్తం అవార్డు


