
● ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ భవనానికి రూ.108.64 కోట్ల
2023లో తరగతులు ప్రారంభం..
ఇంజనీరింగ్ కళాశాల మంజూరైనప్పటికీ శాశ్వత భవనాలు లేకపోవడంతో మొదటి ఏడాది బారుగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలను అద్దెకు తీసుకుని నడిపించారు. అక్కడ అద్దె రూ.లక్షల్లో ఉండడంతో మద్దులపల్లిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ వైటీసీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఈసీఈ, సీఎస్‌సీ, ఈఈఈ, సీఎస్‌డీ, మెకానికల్ బ్రాంచ్‌లలో తరగతులు నిర్వహిస్తుండగా ఒక్కో విభాగంలో 66 మంది చొప్పున మొత్తం 330 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించారు. అయితే 2023 – 24లో మొదటి బ్యాచ్ ప్రారంభం కాగా 150 మంది ప్రవేశం పొందారు. 2024 – 25లో 160 మంది జాయిన్ అయ్యారు. 2025 – 26 బ్యాచ్‌లో ఇంకా 300 మంది వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 310 మంది విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 9 మంది ఉద్యోగులు పని చేస్తుండగా అందులో ముగ్గురు బోధనేతర సిబ్బంది ఉన్నారు.
30 ఎకరాలు.. రూ.108.64 కోట్లు
మద్దులపల్లి పరిధిలో ప్రభుత్వానికి చెందిన 30 ఎకరాల్లో నూతనంగా ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.108.64 కోట్లు మంజూరు చేసింది. మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భూమి, నిధుల కేటాయింపునకు సహకరించారు. దీంతో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్‌లు, తరగతి గదులు, అధ్యాపకుల గదులతో సువిశాలంగా నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఏటా పెరుగుతున్న ప్రవేశాలు..
ఇప్పటివరకు వైటీసీలో తరగతులు నిర్వహిస్తున్నా.. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ భవనాల్లో తరగతుల నిర్వహణ కష్టమనే భావన వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు రెట్టింపుగా ఎంసెట్, పీసెట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో చేరవచ్చని అంచనా. దాదాపు కొత్తగా ప్రథమ సంవత్సరంలో అయిదు బ్రాంచ్‌ల్లో కలిపి మరో 300 మంది చేరే అవకాశం ఉండగా అప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య 600 వరకు ఉంటుంది. వీరందరికీ ప్రస్తుత భవనాల్లో బోధన చేయడం కష్టమే. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా ప్రారంభించి కొత్త భవనాలు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
ఈ ఏడాది కష్టమే..
నిధులు మంజూరైనా ఇంత వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వ భవనాల్లో తరగతుల నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. పనుల నిర్వహణకు మార్చిలో మొదటిసారి టెండర్లు ఆహ్వానించారు. దీంతో పనులు చకచకా సాగి ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందని అంతా ఆశించారు. అయితే కారణం తెలియదు కానీ.. ఆ టెండర్లు రద్దు చేసి మళ్లీ ఆహ్వానించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇలా పనుల్లో రోజురోజుకూ జాప్యం జరుగుతుండడంతో సొంత భవనంలో తరగతుల నిర్వహణ ఎప్పుడోనని విద్యార్థులు వేచిచూస్తున్నారు.