
సాగు సమస్యకు చెక్!
పంటలకు నిరంతర విద్యుత్ సరఫరా..
● డిమాండ్‌కు తగ్గ సరఫరాకు డిస్కమ్‌ల కసరత్తు ● విద్యుత్ ఆధారంగానే అధికంగా పంటలు ● వ్యవసాయ సీజన్‌లో మరింతగా పెరగనున్న వినియోగం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వేసవిలో గృహావసరాలకు అధికంగా వాడగా.. వానాకాలంలో వ్యవసాయ పనులు జోరందుకుంటే విద్యుత్ వినియోగం మరింతగా పెరగనుంది. డిమాండ్‌కు తగిన సరఫరా చేసేందుకు డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. సాగుకు ఆటంకం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సాంకేతిక పరమైన మార్పులకు విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు.. సరఫరాకు అంతగా వ్యత్యాసం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఈ వానాకాలంలో జలాశయాల్లో కొంత నీరు తగ్గినా వ్యవసాయ బోర్లతో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద వస్తుండగా ఈ నెలాఖరు నాటికి ప్రాజెక్టు నిండుతుందనే ఆశతో ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. దీంతో వానాకాలం సాగుకు నీళ్లు ఎలాగైనా వస్తాయనే నమ్మకంతో బోర్లు, బావుల కింద వరి నార్లు పోస్తున్నారు. నాన్ ఆయకట్టులో బోర్లు, బావుల కింద ముమ్మరంగా సాగు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో రెండు నెలల పాటు విద్యుత్ డిమాండ్ పెరగనుంది.
వేసవి తాపంతో..
జిల్లాలో 4,97,098 గృహ సర్వీసులు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. వేసవి కాలంలో గృహావసర విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. రోజుకు 40–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం అధికమై విద్యుత్ డిమాండ్ పెరిగింది.
జూలైలో డిమాండ్‌కు తగినట్లుగా..
ఇక వానాకాలంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ విద్యుత్ డిమాండ్ ఊపందుకుంటుందని డిస్కమ్ అంచనా వేసింది. గతేడాది జూలై కోటా 142.91 మిలియన్ యూనిట్లు కాగా.. 148.59 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఒక రోజు కోటా 4.61 మిలియన్ యూనిట్లు ఉండగా.. 4.79 మిలియన్ యూనిట్ల వరకు వాడారు. ఈ ఏడాది జూలైలో కోటా 149.11 మిలియన్ యూనిట్లు కాగా.. ఇప్పటి వరకు 38.31 మిలియన్ యూనిట్లు వాడారు. ప్రస్తుతం రోజు వారీ కోటా 4.81 ఎం.యూ ఉండగా.. 4.78 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు.
రానున్న కాలంలో మరింతగా..
ఈ ఏడాది ఇంకా వ్యవసాయ సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో విద్యుత్ వినియోగంలో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య అంతగా వ్యత్యాసం లేదు. అయితే వరి సాగు పెరిగి నీటి అవసరాలు అధికమైతే విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడనుంది. ఇప్పుడిప్పుడే రైతులు వరినార్లు పోస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకుంటే విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. వ్యవసాయ అవసరాలకు తగినట్లుగా సరఫరా పెంచేలా చర్యలు చేపడుతోంది.
పెరిగిన కనెక్షన్లకు అనుగుణంగా..
ప్రతీ ఏడాది వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ కనెక్షన్ల కోసం 1,866 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 1,206 మందికి కనెక్షన్లు ఇచ్చారు. మరో 660 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కనెక్షన్లు కాకుండా అదనంగా వచ్చిన సర్వీసులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందో అంచనా వేసి ఆ మేరకు ఉత్పత్తిపై డిస్కమ్‌లు దృష్టి పెట్టాయి.
ఖమ్మం సర్కిల్ పరిధిలో విద్యుత్ సర్వీసుల సంఖ్య
వ్యవసాయ సర్వీసులు
1,20,246
మొత్తం
6,98,569
పరిశ్రమలు, ఇతర కనెక్షన్లు
81,225
గృహ సర్వీసులు
4,97,098
విద్యుత్ బోరు ఆధారంగా సాగు..
వ్యవసాయ విద్యుత్ బోర్ల సాయంతో ఐదెకరాల్లో వరి పంట వేశా. ఈ మధ్య కాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. లోవోల్టేజీ తదితర ఇబ్బందులు కూడా తలెత్తడం లేదు. సబ్‌స్టేషన్లలో ఫీజులు పోయినా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి సమస్య పరిష్కరిస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పొలాలకు నిరంతరం నీరందుతోంది. – నేరడి బిక్షం,
ఎదుళ్ల చెరువు, తిరుమలాయపాలెం మండలం
ఇబ్బందులు లేకుండా..
వ్యవసాయ అవసరాలకు కోతల్లేని విద్యుత్ సరఫరా అందించాలి. పొలానికి నీరు పెట్టిన సమయంలో అరగంట తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోతే తడిసిన పొలం వల్ల కూడా ఉపయోగం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తోంది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 18 వరకు సబ్ స్టేషన్లు ఏర్పాటుచేసిన అధికారులు.. విద్యుత్ లైన్ల మార్పుతోపాటు వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా డివిజన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే అధికారులకు సమాచారం అందిస్తే పరిష్కరించేలా టోల్‌ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో వానాకాలంలో వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా ఉండనున్నాయి.

సాగు సమస్యకు చెక్!

సాగు సమస్యకు చెక్!