
నేటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ
● రాష్ట్రంలో 3.54 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు ● పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కరికీ ఇవ్వలేదు ● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి
నేలకొండపల్లి : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సోమవారం శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొత్తం 3.54.లక్షల కుటుంబాలకు కార్డులు ఇవ్వనుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి నేడు పంపిణీని ప్రారంభిస్తారని వెల్లడించారు. మండలంలో ఆదివారం పర్యటించిన ఆయన.. సుర్దేపల్లి నుంచి బోదులబండ వరకు తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, కోనాయిగూడెంలో సీసీ రోడ్లకు, మంగాపురంతండాలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపిస్తోందని, హామీల అమలకు సిద్ధంగా ఉందని అన్నారు. అర్హులందరికీ నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. నాటి ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే తమ సర్కారు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని, తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయన్నారు. కోనాయిగూడెంలో పెసర పంటను పరిశీలించి సాగు వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి నాట్లు వేసే కూలీల వద్దకు వెళ్లి వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకుల శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, అంజిని, రావెళ్ల కృష్ణారావు, బోయిన వేణు, బచ్చలకూరి నాగరాజు, గుండా బ్రహ్మం, యడవల్లి నాగరాజు, రాయపూడి నవీన్, పెంటమళ్ల పుల్లమ్మ, బొందయ్య, కొమ్మినేని పుష్పావతి, పాకనాటి కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.