
మామిడి పచ్చడికి ధరల సెగ
పచ్చడి పెట్టేందుకు జంకుతున్న సామాన్యులు
● తెగుళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గి.. పెరిగిన కాయల ధరలు ● నూనె, కారం, ఇతర దినుసులదీ అదే పరిస్థితి
మధిర: మాంసాహార ప్రియుల్లో సైతం కొందరు మామిడికాయ పచ్చడితోనే భోజనం ప్రారంభిస్తారు. ఇక శాకాహారులైతే తప్పక పచ్చడి ఉండాల్సిందే. వీరే కాక సన్న, చిన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు ఉదయాన్నే వెళ్లే వారు, కూరలు వండలేని వారికి ఈ పచ్చడే కడుపు నింపుతుంది. దీంతో ఏటా మాదిరి ఈసారి కూడా పచ్చడి పెట్టడానికి సిద్ధమవుతున్న ప్రజలకు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.
ఆది నుంచి అవాంతరాలే...
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో మామిడి చెట్లకు పూత, పిందె సక్రమంగా రాలేదు. అంతేకాక వచ్చిన పూత కూడా చలికాలంలో మంచు కారణంగా తెగళ్లతో రాలిపోయింది. ఆపై అరకొరగా మిగిలిన పూత పిందగా మారగానే ఇటీవల అకాల వర్షాలకు మరో దెబ్బపడినట్లయింది. ఇలా రకరకాల కారణాలతో ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో సీజన్‌లో రోడ్ల వెంట, మార్కెట్లలో విరివిగా లభించే పచ్చడి మామిడికాయలు ఈసారి పెద్దగా అందుబాటులోకి రాలేదు. ప్రధానంగా పచ్చడి తయారీకి ఉపయోగించే చిన్న రసాలు, పెద్ద రసాలు, నాటు, జలాలు, తెల్ల గులాబీ వంటి రకాల కొరతతో డిమాండ్ నెలకొంది.
ఏపీ నుంచి తీసుకొచ్చి...
మార్కెట్‌లో చిన్న రసాలు రూ.30, తెల్ల గులాబీ, జలాలు వంటి రకాలు రూ.50 చొప్పు ధర పలుకుతున్నాయి. ఇక్కడ పెద్దగా దిగుబడి లేకపోవడంతో, జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, ఏ కొండూరు, నూజివీడు తదితర మండలాల నుంచి వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గతంలో ఒక్కో చిన్న రసం చెట్టుకు సుమారు వెయ్యి మామిడికాయలు కాసేవని.. ఈసారి తెగుళ్లు, అకాల వర్షాలతో ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక కొన్ని మామిడికాయలకు మంగు రావడంతో పచ్చడి తయారీకి పనికి రావని కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మిగిలిన కాయలకు డిమాండ్‌తో పాటు ధర పెరుగుతోంది.
అదే బాటలో దినుసులు
ఏడాది పాటు మామిడి పచ్చడి నిల్వ ఉండాలంటే నాణ్యమైన కాయలు ఎంచుకోవడమే కాక మేలు రకం దినుసులు ఎంచుకుంటారు. అయితే, ఈసారి సామగ్రి ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో పచ్చడి పెట్టకముందే మంట పుడుతుందని సామాన్యులు వాపోతున్నారు. చట్నీ పెట్టేందుకు కావాల్సిన నూనె, కారం, ఉప్పు, ఎల్లిపాయలు, ఆవాలు, మెంతుల ధరలు పెరిగాయి. పలు రకాల మిర్చి ధర తక్కువగా ఉన్నా పచ్చడి పెట్టే లావు రకాల మిర్చి ఎక్కువగానే ఉంది. ఈ మిర్చి కేజీ రూ.300 నుంచి రూ.600 వరకు పలుకుతుండగా.. కారం పట్టించడానికి కేజీకి రూ.40 వెచ్చించాల్సి వస్తోంది.
మహిళలు బిజీబిజీ..
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బంధువులు, మిత్రులు ఒక చోటకు చేరి జాడీల కొద్ది పచ్చడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకొందరు తమ బంధువులు, స్నేహితులు, ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్ల లకు పంపించేందుకు మామిడికాయ పచ్చడి తయారుచేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా కారం మిల్లుల్లో రద్దీ ఉంటుండగా, పచ్చడి తయారీతో పలువురి ఇళ్లు కళకళలాడుతున్నాయి.
పచ్చడి దినుసుల ధరలు
సామగ్రి ధర
(కేజీకి రూ.ల్లో)
కారం 300 – 600
ఎల్లిపాయలు 200
శనగ నూనె 170
ఆవాలు 170
మెంతులు 180
నువ్వుల నూనె 410
అయినా తప్పడం లేదు..
ఏటా పచ్చడి పెట్టడం తప్పనిసరి. కూర చేయలేని రోజు, కూరగాయల ధరలు పెరిగినప్పుడు పచ్చడి తీసుకుని కూలీ పనులకు వెళ్తాం. ఈసారి పచ్చడికి ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగినా తప్పడం లేదు. – కృష్ణవేణి, కూలీ, మధిర
పిల్లలకు పంపించేందుకు...
అమెరికా, హైదరాబాద్, ఖమ్మంలో ఉంటున్న పిల్లలకు ఏటా పచ్చడి పంపిస్తాం. కూరగాయలతో తినలేనప్పుడు పచ్చడి ఉయోగపడుతుంది. అందుకే ఏటా అందరికీ కలిపి మామిడికాయ పచ్చడి పెడతాం. – రమావత్ మారోనిబాయి, మధిర

మామిడి పచ్చడికి ధరల సెగ

మామిడి పచ్చడికి ధరల సెగ

మామిడి పచ్చడికి ధరల సెగ