
ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
● 36 తులాల బంగారంతో పాటు వెండి, నగదు అపహరణ ● రెక్కీ చేసి మరీ చోరీకి పాల్పడిన నిందితులు?
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఆరో డివిజన్‌లోని న్యూ ఖానాపురంలో భారీ చోరీ కలకలం రేపింది. తిరుమలలో దైవదర్శనానికి వెళ్లిన ఉపాధ్యాయుడి ఇంటిని లక్ష్యంగా ఎంచుకున్న దుండగులు చోరీకి పాల్పడ్డారు. కామేపల్లి మండలం పాతలింగాల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బానోతు శోభన్ – వనిత దంపతులు న్యూఖానాపురంలో నివసిస్తుండగా కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి రైలులో తిరుపతి బయలుదేరారు. ఇదే సమయాన స్కూటీపై వచ్చిన దుండగులు, ఎవరూ లేరని నిర్ధారించుకున్నట్లు తెలిసింది. ఆపై రెండు గడ్డపారలతో తాళం పగలగొట్టి లోనకు ప్రవేశించారు. అనంతరం బీరువా, లాకర్లను బద్దలుకొట్టి అందులో దాచిన 36 తులాల బంగారం, 30తులాల వెండి ఆభరణాలు, రూ.12వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయం మంగళవారం ఉదయం బయటపడడంతో ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ క్లూస్‌టీమ్‌తో చేరుకుని ఆధారాలు సేకరించారు.
45నిమిషాల పాటు ఇంట్లోనే..
మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయాన ముసుగులు ధరించిన దుండగులు ఉపాధ్యాయుడు శోభన్ ఇంట్లోకి ప్రవేశించి సుమారు 45నిమిషాల పాటు ఉన్నారు,. వీరి కదలికలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా, చోరీ తర్వాత బయటకు వస్తుండగా, అప్పుడే వాకింగ్‌కు వెళ్తున్న స్థానికుడైన కృష్ణారావుకు అనుమానం వచ్చి శోభన్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన తమ బంధువులను పంపించగా చోరీ విషయం బయటపడింది. కాగా, శోభన్ ఇంట్లోనే కాక అదే భవనంలో కింద అద్దెకు ఉండే వారి ఇంటి కూడా తాళం పగలగొట్టినట్లు సీసీ కెమెరాల పుటేజీ ద్వారా గుర్తించారు. ఈమేరకు తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్న ఉపాధ్యాయ దంపతులు ఖమ్మం చేరుకుని పోలీసులను అశ్రయించారు. కాగా, ఖమ్మం స్టేషన్‌కు వెళ్లే సమయంలో ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా ఆటో బుక్ చేసుకోగా, ఆటో డ్రైవర్ పైనా అనుమానంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.