అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు

May 13 2025 12:20 AM | Updated on May 13 2025 12:20 AM

అందుబ

అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు

● ఉమ్మడి జిల్లాలో 4,422 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం ● 50 శాతం మేర సబ్సిడీతో విక్రయం ● పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతుసేవా కేంద్రాల ద్వారా అమ్మకానికి ఏర్పాట్లు

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్‌ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం ప్రాంతీయ కార్యాలయం నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యాన భూసారం పెంపునకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు చల్లి ఆపై కలియదున్నడం ఆనవాయితీ. ఈక్రమంలోనే వ్యవసాయ శాఖ జీలుగు, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పైర్ల పెంకానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా విత్తనాభివృద్ది సంస్థ విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

వ్యవసాయ శాఖ ఇండెంట్‌ ఆధారంగా..

ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ నుంచి అందిన ఇండెంట్‌ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సమకూరుస్తోంది. ఖమ్మం జిల్లాలో జీలుగు 14వేల క్వింటాళ్లు, జనుము 1,500 క్వింటాళ్లు, పిల్లిపెసర 150 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో జీలుగు 5వేల క్వింటాళ్లు, జనుము 400 క్వింటాళ్లు, పిల్లి పెసర 50 క్వింటాళ్లకు కావాలని నివేదిక ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు జీలుగు 3,252 క్వింటాళ్లు, జనుము 1,170 క్వింటాళ్లు కలిపి 4,422 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు.

సబ్సిడీతో విక్రయాలు

సహజసిద్ధమైన ఎరువు లభించేలా పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. విత్తనాలపై 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. కిలో రూ.142.75 ధర ఉన్న జీలుగు విత్తనాలను రూ.71.25కు, రూ.125.50 ధర ఉన్న జనుము విత్తనాలను రూ.62.75కు, రూ.205.50 ధర ఉన్న పిల్లి పెసర విత్తనాలను రూ.102.50కు విక్రయిస్తారు. ఖమ్మం జిల్లాలోని 75 పీఏసీఎస్‌లు, 13 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రెండు టీజీఎస్‌డీఎల్‌, ఒక ట్రేడర్‌తో పాటు భద్రాద్రి జిల్లాలో 20 పీఏసీఎస్‌లు, ఏడు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ఒక ట్రేడర్‌ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు.

విత్తనాల బ్యాగ్‌ పరిమాణం, ధరలు

విత్తనంబ్యాగ్‌ (కిలోల్లో) ధర (రూ.ల్లో)

జీలుగు 30 2,137.50

జనుము 40 2,510.00

పిల్లి పెసర 20 2,055.00

విత్తనాలు సిద్ధం..

ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్‌ ఆధారంగా పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెప్పిస్తున్నాం. ఇప్పటికే చేరకున్న జీలుగు, జనుము విత్తనాలను నిర్దేశిత కేంద్రాలకు పంపించాం. 50 శాతం సబ్సిడీపై విక్రయించేలా పర్యవేక్షించనున్నాం.

– ఎన్‌ బిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ

మేనేజర్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లా

అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు1
1/1

అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement