
అదుపు తప్పిన కారు.. ఒకరికి గాయాలు
నేలకొండపల్లి: ఓ కారు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లగా తృటిలో ప్రమాదం తప్పింది. మండలంలోని అమ్మగూడెం మీదుగా వెళ్తున్న కారు సోమవారం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ముదిగొండ మండలం మాధాపురానికి చెందిన నాగిరెడ్డి నేలకొండపల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు దెబ్బతినగా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
వడదెబ్బతో కూలీ మృతి
పెనుబల్లి: వడదెబ్బ బారిన పడిన వృద్ధుడు మృతి చెందాడు. పెనుబల్లి ఎస్సీ కాలనీకి చెందిన దండు స్వామి(60) రోజు మాదిరిగానే సోమవారం కూలీ పనికి వెళ్లాడు. సాయంత్రం ముత్యాలమ్మ గుడివైపు నడిచి వెళ్తుండగా వడదెబ్బతో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో స్థానికులు ఆయనను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
ప్రేమ చూపడం లేదని
మహిళ ఆత్మహత్య
పెనుబల్లి: ఇంట్లో ఎవరూ తనతో ప్రేమగా ఉండడం లేదని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన తోట అంజమ్మ(40) తనతో కుమారులు, కుటుంబీకులు ప్రేమగా ఉండటం లేదంటూ.. వారిని బెదిరించే క్రమంలో 20 బీపీ మాత్రలు మింగింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోగా, ఆలస్యంగా గమనించిన కుటుంబీకులు పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుండి ఖమ్మం ప్రభుత్వ ఆస్పకి తరలించగా అంజమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మానసిక స్థితి సరిగ్గా లేక...
ఖమ్మంక్రైం: మానసికస్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మంలోని బోనకల్ క్రాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన యనగండ్ల శ్యామ్‌కుమార్(21) సోమవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.