రేపు కేఎంసీ బడ్జెట్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

రేపు కేఎంసీ బడ్జెట్‌ సమావేశం

Mar 24 2025 2:10 AM | Updated on Mar 24 2025 2:10 AM

రేపు కేఎంసీ బడ్జెట్‌ సమావేశం

రేపు కేఎంసీ బడ్జెట్‌ సమావేశం

ఖమ్మంమయూరిసెంటర్‌ : ఖమ్మం నగరం విస్తరిస్తుండడంతో అభివృద్ధి, ఆదాయం పెరుగుతోంది. కేఎంసీకి వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. రాబోయే 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్‌ అధికారులు రూపొందించిన అంచనా బడ్జెట్‌ ఈ విషయాన్ని తెలియజేస్తోంది. 2023 – 24లో రూ.67.08 కోట్లు ఉన్న బడ్జెట్‌ 2024 – 25లో రూ.80.67 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఆ ఏడాదికి సంబంధించి రివైజ్డ్‌ బడ్జెట్‌ రూ.90.82 కోట్లుగా చూపిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సర ఆదాయం, ఖర్చులను లెక్కలు కట్టి 2025 – 26 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్‌ను రూ.102.82 కోట్లుగా రూపొందించారు. మంగళవారం జరిగే కేఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో దీన్ని ప్రతిపాదించనున్నారు.

ఆదాయం ఇలా..

2025–26 ఆర్థిక సంవత్సరంలో కేఎంసీకి వచ్చే ఆదాయ వివరాలపై ఓ అంచనా వేశారు. ఆస్తి పన్నుల ద్వారా రూ.33.92 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ ద్వారా రూ.13 కోట్లు, కేఎంసీ భవనాల అద్దెల ద్వారా రూ.4.43 కోట్లు, ప్రజారోగ్యం/పారిశుద్ధ్యం ద్వారా రూ.3.61 కోట్లు, టౌన్‌ ప్లానింగ్‌ ద్వారా రూ.36.10 కోట్లు, ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా రూ.11.76 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక డిపాజిట్లు, అడ్వాన్సులు, రుణాల ద్వారా మరో రూ.6.76 కోట్లు ఆదాయం వస్తుందని లెక్కలు వేశారు.

ఖర్చులు ఇలా..

రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేఎంసీ ఖర్చులపైనా అధికారులు అంచనాలు వేశారు. ప్రధానంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలకు రూ.30.70 కోట్లు, పారిశుద్ధ్యానికి రూ.11.16 కోట్లు, విద్యుత్‌ చార్జీలు రూ.10.90 కోట్లు, రుణాల చెల్లింపు రూ.2.01 కోట్లు, గ్రీన్‌ బడ్జెట్‌ రూ.10.28 కోట్లు, ఇంజనీరింగ్‌ విభాగం నిర్వహణకు రూ.7.77 కోట్లు, సాధారణ పరిపాలన వ్యయం రూ.5.83 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌ విభాగం వ్యయం రూ.52 లక్షలు, విలీన గ్రామాలకు రూ.7.88 కోట్ల కేటాయింపు, పబ్లిక్‌ ఎమిటేషన్‌ వ్యయం రూ.79 లక్షలు, వార్డు బడ్జెట్‌ రూ.14.97 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సులు, రుణాలు రూ.6.76 కోట్లుగా లెక్కలు వేశారు.

కార్పొరేటర్లకు బడ్జెట్‌ కాపీలు..

ఈనెల 25న ఖమ్మం నగర పాలక సంస్థ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్‌ పునుకొల్లు నీరజ, కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య ఆదేశాలతో ఇప్పటికే బడ్జెట్‌ అంచనాను రూపొందించిన అధికారులు సంబంధిత కాపీలను కార్పొరేటర్లకు అందజేశారు. ఈనెల 25న కార్పొరేటర్లు బడ్జెట్‌ సమావేశాలకు రావాలని ఆహ్వాన పత్రం అందించడంతో పాటు బడ్జెట్‌ కాపీని అందజేశారు. అధికారులు రూపొందించిన బడ్జెట్‌పై కార్పొరేటర్లు ముందుగానే అవగాహన పొందేందుకు ఈ కాపీలను అందించినట్లు తెలిసింది.

2025–26 సంవత్సరానికి

రూ.102.71 కోట్ల ఆదాయం అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement