రైతులు ఆందోళన చెందొద్దు | Sakshi
Sakshi News home page

రైతులు ఆందోళన చెందొద్దు

Published Fri, May 31 2024 12:14 AM

రైతులు ఆందోళన చెందొద్దు

● విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి ● ఆథరైజ్డ్‌ డీలర్ల వద్దే కొనుగోలు చేయండి ● కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ సునీల్‌దత్‌

ఖమ్మం సహకారనగర్‌ /రఘునాథపాలెం : జిల్లాలో రైతులకు అవసరమైన పత్తి, జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్‌ వీ.పీ. గౌతమ్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన సీపీ సునీల్‌దత్‌తో కలిసి విలేకరులతో, అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్‌ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పత్తి సాగులో రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఖమ్మం రెండో స్థానంలో ఉందన్నారు. గతం కంటే ఈ ఏడాది పత్తి విత్తనాలు అఽధికంగా అందుబాటులో ఉంచామన్నారు. ఈ ఏడాది 2,01,834 ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, అందుకు గాను 4 లక్షల ప్యాకెట్లు అవసరం అవుతుండగా 4.50 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. అదనంగా 1.60 లక్షల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. రైతులు ఒకే రకమైన కంపెనీ విత్తనాల కోసం పోటీ పడొద్దని, అందుబాటులో ఉన్న వివిధ రకాల విత్తనాలు వినియోగించుకోవాలని సూచించారు. జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలు మొత్తం 21,276 క్వింటాళ్లు జిల్లాకు కేటాయించగా ఇప్పటి వరకు 14,114.7 క్వింటాళ్లు వచ్చాయని తెలిపారు. ఇందులో 11,123.8 క్వింటాళ్లు విక్రయించగా 2990.9 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఆథరైజ్డ్‌ డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలన్నారు. బిల్లులు తీసుకుని పంట దిగుబడి చేతికందే వరకు భద్రపర్చుకోవాలని సూచించారు. రెండు రోజుల క్రితం బోనకల్‌లో రైతులు అధికంగా విత్తనాల కొనుగోలుకు వచ్చారని, భారీ క్యూ ఉందని విస్తృత ప్రచారం జరిగిందని, అయితే ఆరోజు పంచమి మంచి రోజుగా భావించి రైతులు విత్తనాల కొనుగోలుకు వచ్చారే తప్ప కొరత, ఇతర అంశాలు కారణం కాదని వివరించారు. విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు కూపన్లు జారీ చేయగానే పీఏసీఎస్‌లకు కేటాయించిన విత్తనాలు విక్రయించాలన్నారు. సీపీ సునీల్‌దత్‌ మాట్లాడుతూ..లైసెన్స్‌ లేనివారు విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏడు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, నిత్యం టాస్క్‌ఫోర్స్‌ తదితర బృందాలతో నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement