
ఎండలతో బెంబేలు..
● రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ● ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి ● వైరాలో గరిష్టంగా 47 డిగ్రీలు నమోదు ● ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగత
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో కొద్ది రోజులు చల్లబడినా.. రోహిణి కార్తె ప్రారంభంతో మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండవేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వైరాలో గురువారం రికార్డు స్థాయిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అలాగే ముదిగొండ మండలం పమ్మిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలోని 11 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదవడం గమనార్హం.
ఠారెత్తిస్తున్న భానుడు..
ఈ వేసవి కాలం ప్రారంభం నుంచి విపరీతమైన ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మే నెల ప్రారంభంలో ముదిగొండ మండలం పమ్మిలో 46.6 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. అప్పటివరకు అదే అత్యధికం. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. అయితే ఉపరితల ద్రోణి కారణంగా కొద్దిరోజులు వర్షాలు కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక రోహిణి కార్తె ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం. రోహిణి కార్తెలో ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటోంది.
వైరాలో 47 డిగ్రీలు..
జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వైరాలో 47 డిగ్రీలు నమోదు కావడం విశేషం. ఈ వేసవి సీజన్‌లో జిల్లాలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. జిల్లాలోని మూడు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా, ఎనిమిది ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా, 16 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా, 13 ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఎండ వేడిమికి పలువురు వడదెబ్బకు గురవుతుండగా రక్షణ చర్యలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు (డిగ్రీలలో)
మండలం ప్రాంతం ఉష్ణోగ్రత
వైరా వైరా 47
ముదిగొండ పమ్మి 46.5
సింగరేణి కారేపల్లిగేట్ 46
ఖమ్మంఅర్బన్ ఖానాపురం 45.8
ముదిగొండ బాణాపురం 45.7
మధిర మధిర 45.4
కొణిజర్ల కొణిజర్ల 45.4
చింతకాని చింతకాని 45.2
నేలకొండపల్లి నేలకొండపల్లి 45.1
తల్లాడ తల్లాడ 45.1
కొణిజర్ల పెద్దగోపతి 45

ఎండలతో బెంబేలు..