
ఎపిక్‌కార్డుతో పాటు పంపిస్తున్న ఓటరు ప్రతిజ్ఞ
ఖమ్మం సహకారనగర్: ఓటర్లను ఆలోచింపచేసేలా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఓటర్లు నమోదైన వారికి కేవలం గుర్తింపు కార్డులు మాత్రం జారీ చేసేవారు. కానీ ఇప్పుడు ఓటు నమోదుపై కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో 18ఏళ్లు నిండిన వారంతా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఫొటో గుర్తింపు కార్డులను పోస్టల్ శాఖ ద్వారా చేరవేస్తున్నారు. అయితే, కేవలం కార్డు మాత్రం కాక ఆ కవర్‌లో ఓటు నమోదు ఆవశ్యకత, ఓటు ఎలా వేయాలనే వివరిస్తూ రూపొందించిన కరపత్రాలు సైతం జత చేస్తున్నారు. అలాగే, హెల్ప్‌లైన్ నంబర్లు, ఓటరు జాబితాలో పేరు చూసుకునేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను సైతం పొందుపర్చారు. ఇక లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇంకో అడుగు ముందుకేసిన ఎన్నికల సంఘం ఓటరు ప్రతిజ్ఞను కూడా పంపిస్తోంది. ఇందులో ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాత్ర ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము’ అని ముద్రించారు. దీనికి తోడు ‘మీ అభ్యర్థిని తెలివిగా ఎంపిక చేసుకోండి... నీతిగా ఓటు వేయండి.. జ్ఞానం కల ఓటరుగా ఉండండి... మీ ఓటు వేయటాన్ని ఎప్పుడు చేజారనివ్వకండి’ అంటూ ముద్రించడం ఓటర్లను ఆలోచింపచేస్తోంది.