రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే... | - | Sakshi
Sakshi News home page

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే...

Sep 26 2023 12:26 AM | Updated on Sep 26 2023 12:26 AM

- - Sakshi

● ఉమ్మడి జిల్లాలో పది సీట్లూ గెలుస్తాం.. ● సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ● కాంగ్రెస్‌లో చేరాక జిల్లాకు వచ్చిన తుమ్మలకు ఘన స్వాగతం ● హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేతలు

ఖమ్మం వన్‌టౌన్‌: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాక తొలిసారి సోమవారం ఖమ్మం వచ్చారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఖమ్మం రూరల్‌ మండలం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలకగా... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ర్యాలీగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ హైదరాబాద్‌ తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే అమలుచేసి తీరుతామన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తించి ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. అయితే, బీఆర్‌ఎస్‌ పార్టీ మద్యం, అధికారం, డబ్బును అడ్డం పెట్టుకుని మరోమారు అధికారంలోకి రావాలని చూస్తున్నప్పటికీ అది జరగదని తెలిపారు. వచ్చే ఎన్నికలు బీఆర్‌ఎస్‌ పార్టీ అహంకారం – ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనుకునే కాంగ్రెస్‌ మధ్య జరుగనున్నాయని వివరించారు. ఏదిఏమైనా ధర్మయుద్ధంలో ప్రజల సహకారంతో తామే గెలుస్తామని.. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలను గెలవడమేకాక రాష్ట్రంలో 74 నుంచి 78 స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని.. తాము రాష్ట్ర సంపదను దోచుకోకుండా ప్రజలకు పంచుతామని భట్టి వెల్లడించారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ అక్రమంగా అమ్మిన భూములను, పేదల నుంచి లాక్కొన్న భూములను తిరిగి చట్టపరంగా పేదలకు ఇస్తామని తెలిపారు.

పార్టీ బలోపేతానికి కృషి..

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తన ప్రజాజీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. భద్రాచలం శ్రీరామచంద్రుడి దయతో జిల్లా, రాష్ట్రాభివృద్ధి కృషి చేశానని, భవిష్యత్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తానన్నారు. కాంగ్రెస్‌ జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకత్వం తనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడమే గౌరవం, గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోచైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏ హామీని అమలుచేయకపోగా రాష్ట్రాన్ని కల్వకుంట్ల ప్రభుత్వం దోచుకుందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిరుద్యోగ యువత నష్టపోయిందని, తాము అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు మహ్మద్‌ జావీద్‌, రాయల నాగేశ్వరరావు, సాధు రమేష్‌రెడ్డి, దొబ్బల సౌజన్య, నాగండ్ల దీపక్‌చౌదరి, రాందాస్‌, జారె ఆదినారాయణ, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, యడ్లపల్లి సంతోష్‌ పాల్గొన్నారు.

తుమ్మలకు ఘన స్వాగతం, ర్యాలీ

ఖమ్మంరూరల్‌: కాంగ్రెస్‌లో చేరాక తొలిసారి ఖమ్మం వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం రూరల్‌ మండలం బారుగూడెం శ్రీసిటీలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి గొల్లగూడెం, వరంగల్‌ క్రాస్‌రోడ్‌, పెదతండా, నాయుడుపేటకు చేరుకున్నారు. ఈసందర్భంగా పెద్దసంఖ్యలో ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించగా, బాణసంచా కాల్చారు. నాయకులు సాధు రమేష్‌రెడ్డి, గరికపాటి వెంకట్రావు, మద్ది వీరారెడ్డి, జంగం భాస్కర్‌, పత్తి శ్రీనివాస్‌, జొన్నలగడ్డ రవికుమార్‌, ఎరసాని శివశంకర్‌రెడ్డి, యాట శ్రీను, చింతమళ్ల రవికుమార్‌, తేజావత్‌ పంతులు నాయక్‌, ఎల్లయ్యనాయక్‌, చీకటి శ్రీనివాస్‌, తోట వీరభద్రం, పల్లెర్ల పాండు, కన్నేటి వెంకన్న పాల్గొన్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement