
స్వామి వారి దర్శనానికి బారులు తీరిన భక్తులు
ఖమ్మంగాంధీచౌక్: ఉగాది వేడుకలను జిల్లా ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సంవత్సరాది ‘శోభకృత్’ నామ సంవత్సరానికి ప్రారంభ సూచికగా పూజలు చేయడంతో పాటు ఉగాది పచ్చడి స్వీకరించారు. అలాగే, ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. ఉగాది పర్వదినాన ప్రజలు తమ ఇష్ట దైవాలను సందర్శించటం ఆనవాయితీ కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పొటెత్తారు. ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, శ్రీ భ్రమరాంబ సహిత గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడాయి.
పంచాంగ శ్రవణానికి ప్రాధాన్యం
నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణానికి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారు. దేవాలయాలు, ఫంక్షన్ హాళ్లలో పంచాంగ కర్తలు, పండితులు పంచాంగ పఠనం చేయగా.. ప్రజలు తమ రాశుల ప్రకారం ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. ఇక ఉగాది రోజున రైతులు సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయ పనులను ప్రారంభించారు. పశువులు, వాహనాలను అలంకరించి వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. అలాగే, వ్యాపారులు కొత్త దస్త్రాలను ప్రారంభించి పూజలు చేశారు.
ఇంటింటా ఉగాది వేడుకలు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఆసక్తిగా పంచాంగ శ్రవణం

ఖమ్మంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హారతి ఇస్తున్న అర్చకులు