బడ్జెట్‌ ఉన్నట్టా.. లేనట్టా?! | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ఉన్నట్టా.. లేనట్టా?!

Mar 23 2023 12:46 AM | Updated on Mar 23 2023 12:46 AM

వైరా మున్సిపాలిటీ కార్యాలయం - Sakshi

వైరా మున్సిపాలిటీ కార్యాలయం

వైరా: జిల్లాలోని ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యాయి. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ రూపొందించి ఆమోదించుకున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై అంచనాలు ఖరారయ్యాయి. కానీ వైరా మున్సి పాలిటీలో మాత్రం ఇప్పటి వరకు 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ఉంటుందా, ఉండదా.. ఉంటే ఎప్పుడు సమావేశం నిర్వహిస్తారనేది తేలడం లేదు.

వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు

వైరా మున్సిపల్‌ చైర్మన్‌ జైపాల్‌ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి వెంట నడుస్తుండడంతో ఆయనను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఆతర్వాత కౌన్సిలర్లు పలువురు కలెక్టర్‌ను కలిసి చైర్మన్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. ఇలా కౌన్సిలర్లు రెండుగా విడిపోవడంతో బడ్జెట్‌ సమావేశం జరుగుతుందా, లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది రూ.12.40కోట్లతో వైరా మున్సి పల్‌ బడ్జెట్‌ ఆమోదించారు. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశం నిర్వహణపై కలెక్టర్‌ నుండి ఆదేశాలతో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ అనిత నోటీసులు కూడా సిద్ధం చేశారు. కాగా, అధికార బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కొందరు పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని, అవసరమైతే సమావేఽశాన్ని బహిష్కరిస్తామని చెప్పినట్లు సమాచారం. కౌన్సిలర్లు సహకరిస్తే ముందుగా సాధారణ సమావేశం ఏర్పాటుచేసి ఆతర్వాత నోటీసులు పంపి బడ్జె ట్‌ సమావేఽశం నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.

రూ 36.66 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు

వైరా మున్సిపాలిటీకి రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు రూ.30కోట్ల నిధులు రానున్నాయి. వీటితో పాటు ఇతర నిధులతో చేపట్టే పనుల ప్రతిపాదనలకు కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి. మొత్తంగా రూ.36.66 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంకాగా.. మరో ఎనిమిది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికీ ఇప్పటికే బడ్జెట్‌ సమావేశం నిర్వహించి ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉన్నా అలా జరగలేదు. మరోవైపు మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, ఇతర నిధుల వినియోగం కూడా నిలిచిపోయే అవకాశముంది. ఈక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు సమావేశానికి హాజరైతే బడ్జెట్‌కు ఆమోదం లభించడంతో పాటు ఇతర పనులు సాఫీగా జరుగుతాయి. ఇప్పటికే ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అనిత, కొందరు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి రూ.30 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులపై చర్చించినట్లు సమాచారం. ఈక్రమంలో కలెక్టర్‌ సుందరీకరణకు 50 శాతం నిధులు ఖర్చు చేయాల్సిందేనని చెప్పగా.. కౌన్సిలర్లు మాత్రం 20 వార్డులకు రూ.20 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. కాగా, బడ్జెట్‌ సమావేశం విష యం పక్కనపెడితే మున్సిపల్‌ కౌన్సిల్‌లో ప్రతిష్టంభన కారణంగా పాలనపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు.

వైరా మున్సిపల్‌ బడ్జెట్‌పై ప్రతిష్టంభన

త్వరలో ముగియనున్న ఆర్థిక సంవత్సరం

ప్రతిపాదనలు సిద్ధమైనా సమావేశం కాని కౌన్సిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement