
గోవిందరాజు స్వామి ఆలయంలో మృత్యంగ్రహణ పూజలు చేస్తున్న అర్చకులు
భద్రాద్రి రామాలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు..
● తిరుకల్యాణ, పుష్కర పట్టాభిషేక మహోత్సవాలకు అంకురార్పణ ● అర్చక స్వాములకు దీక్షా వస్త్రాలు అందజేత ● వేద పండితులచే పంచాంగ శ్రవణం ● రామయ్య ఆదాయం 11, వ్యయం 08
స్వామివారికి ఆదాయం అధికం..
అమ్మవారికి ఖర్చు ఎక్కువ..
రామాయలంలో బుధవారం శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేపపూత పచ్చడి నివేదన చేసి భక్తులందరికీ ప్రసాదంగా పంపిణీ చేశారు. సాయంత్రం బేడా మండపంలో వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. శోభకృత్ అంటే శుభాలు కలిగిస్తుందని, దేశం సుభిక్షింగా ఉంటుందని చెప్పారు. ఇక ఈ ఏడాది రామయ్య ఆదాయం 11, వ్యయం 08, రాజపూజ్యం 05, అవమానం 04 అని తెలిపారు. సీతమ్మవారి ఆదాయం 02, వ్యయం 11 అని, రాజపూజ్యం 04, అవమానం 07గా ఉంటాయని వివరించారు.
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తిరుకల్యాణోత్సవాలతో పాటు ఈనెల 31న జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలకు కూడా అంకురార్పణ చేశారు. ఉదయం మూలమూర్తుల వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్న తర్వాత శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. మొదట ఓంకార ధ్వజారోహణం జరిపి, ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనం నిర్వహించారు. ఆ తర్వాత విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం, రక్షా బంధనం గావించారు. అనంతరం ఆలయ ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవానీ రామకృష్ణ రామాయణ పారాయణదారులకు, ఆచార్య, బ్రహ్మ, రుత్విక్‌లకు దీక్షా వస్త్రాలు అందజేశారు. తర్వాత మూలమూర్తులు, ఉత్సవ పెరుమాళ్లు, నిత్యకల్యాణ మూర్తులతో పాటు ఆచార్య, బ్రహ్మ, రుత్విక్‌లకు అర్చకులు దీక్షా కంకణధారణ చేశారు.
ఘనంగా మృత్యంగ్రహణం..
ఇక బుధవారం సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చి తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ సేకరించిన పుట్టమట్టిని మరో వాహనంపై ఉంచి ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలతో మృత్సంగ్రహణం నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కాగా, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలకు 22న, బ్రహ్మోత్సవాలకు ఈనెల 26న అంకురార్పణ చేస్తామని దేవస్థానం వారు ముద్రించిన కరపత్రాల్లో పేర్కొన్నప్పటికీ.. రెండు వేడుకలకూ బుధవారమే అంకురార్పణ చేయడం గమనార్హం.
యాగశాలలో పర్యగ్నీకరణం..
మేళతాళాలు, కోలాటాల నడుమ ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా తీసుకొచ్చి నూతనంగా నిర్మించిన తాత్కాలిక యాగశాలలలో వేంచేపు చేశారు. ఆ తర్వాత వాస్తు పూజ, వాస్తు హోమం, పర్యగ్నీకరణం జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. రామ మహాక్రతువు జరిగే పుష్కర, చతుర్వేద యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 118 మంది రుత్విక్‌లు సామూహిక శ్రీరామాయణ పారాయణ హవనం, విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తారని వివరించారు. చివరగా చిత్రకూట మండపంలో సామూహిక సంక్షేమ రామాయణ పారాయణం జరిపి, హారతి సమర్పించారు.

పంచాంగ శ్రవణం చేస్తున్న మురళీకృష్ణమాచార్యులు