
వెంకటస్వామి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టీఎస్ యూటీఎఫ్ బాధ్యులు
ఖమ్మంసహకారనగర్: పాత పెన్షన్ విధానం సాధన కోసం నిరసన ప్రదర్శనల్లో ఉద్యోగులు పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించాక వారు మాట్లాడారు. పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలంటూ జరగుతున్న నిరసనల్లో ఉద్యోగులు పాల్గొనవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పడం గర్హనీయమని, ఉద్యోగుల సామాజిక భద్రతకు ముప్పుగా ఉన్న సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఉద్దండు షరీఫ్, నాయకులు లక్ష్మీనారాయణ, పుల్లయ్య, శంకరరావు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.