
పులి వాహనంతో అర్చకులు, భక్తులు
కూసుమంచి: మండల కేంద్రంలోని గంగమ్మ తల్లి ఆలయానికి గ్రామానికి చెందిన అర్చకులు రంగబాలాజీ – శ్రీవిద్య దంపతులు రూ.70 వేల విలువైన పులి వాహనం, ఛత్రిని బుధవారం బహూకరించారు. శివపార్వతి సమేత గణపేశ్వరుడి ఊరేగింపు నిమిత్తం ఈ వాహనం అందజేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్నామోహన్, శివాలయం చైర్మన్ కొక్కిరేని వీరస్వామితో పాటు బారి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి ఆలయానికి విరాళాల వెల్లువ
తల్లాడ: మండలంలోని పాత మిట్టపల్లిలో మల్లికార్జునస్వామి ఆలయ నిర్వహణకు పలువురు విరాళాలు అందజేశారు. గ్రామానికి చెందిన దొబ్బల చిన్నపుల్లయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ.2,11,116 నగదు అందజేశారు. అలాగే, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించిన రూ.50 వేల విరాళాన్ని డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు ద్వారా అందించారు. కార్యక్రమంలో కొండపల్లి శేఖర్‌బాబు, మువ్వ కోటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
వేంసూరు: మండలంలోని అరిసెలపాడులో బుధవారం ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోటమర్తి చిన్న వెంకటేశ్ (57) ఇంట్లో నీళ్ల కోసం మోటార్ ఆన్ చేస్తుండగా షాక్ కొట్టింది. దీంతో ఆయనను ఏపీలోని తిరువూరు ఆస్పత్రికి తరలిస్తుండగా గ్రామ శివారులోనే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌కు తీవ్రగాయాలు..
ఖమ్మంరూరల్: మండలంలోని తనగంపాడు, కస్నాతండా మధ్య విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పనిచేస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతంతో గాయపడ్డాడు. తనగంపాడుకు చెందిన బాలకృష్ణ గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, పొలాల వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లో బుధవారం సాయంత్రం పోయిన ఫ్యూజ్ వేస్తున్నాడు. ఇది తెలియని ఓ రైతు బ్రేకర్ ఆన్ చేశా డు. ఈ క్రమంలో షాక్‌కు గురైన బాలకృష్ణ రెండు చేతులు, కాళ్లు కాలిపోవడమే కాక కిడ్నీ పగిలిపోయింది. దీంతో చికిత్స కోసం బాలకృష్ణను స్థానిక రైతులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
9 అడుగుల
కొండచిలువ హతం
రఘునాథపాలెం: మండలంలోని కోయచలక సమీపాన కోయచలక–పాపటపల్లి రోడ్డులో బుధవారం తొమ్మిది అడుగుల కొండచిలువ కలకలం రేపింది. రైతులు ఉదయాన వ్యవసాయ పనులకు వెళ్తుండగా కొండచిలువ రోడ్డుకు అడ్డంగా వెళ్తుండడంతో ఆందోళనకు గురై దానిని హతం చేశారు.
కార్మికురాలి
అంత్యక్రియల్లో వివాదం
ఖమ్మంమయూరిసెంటర్: ఉద్యోగాల కోసం డబ్బు వసూళ్ల ఆరోపణలతో అధికారులు మందలించారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు నాగరాణి మంగళవారం మృతి చెందిన విషయం విదితమే. ఆమె మృతదేహాన్ని బుధవారం రాత్రి ఖమ్మం తీసుకొచ్చారు. ఈక్రమంలో మృతదేహాన్ని కాల్వొడ్డు వైకుంఠథామంకు తరలించగా, వెంటనే అంత్యక్రియలు పూర్తిచేయాలని పోలీసులు సూచించారు. ఈక్రమంలో ఆమె బంధువులు, పోలీసులకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
కలప పట్టివేత
టేకులపల్లి: రెండున్నర లక్షల రూపాయల విలువైన నారవేప దుంగలను ఫారెస్టు అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎఫ్‌ఆర్‌ఓ కథనం ప్రకారం.. మండలంలోని కోయగూడెం పంచాయతీ హనుమాతండా సమీపంలో నారవేప దుంగలు అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో ఎఫ్‌ఆర్‌ఓ ముఖ్తార్ హుస్సేన్, ఎఫ్‌ఎస్‌ఓలు దేవాసింగ్, శ్రీనివాస్, ఎఫ్‌బీఓలు నాగేష్, రామ్మూర్తి దాడులు చేశారు. కిషన్ అనే రైతు జామాయిల్ తోటలో ఉన్న రూ.2.5 లక్షల విలువైన 15 నారవేప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలను ఇల్లెందు డిపోకు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. నిందితుడి వివరాలు తెలియరాలేదని, విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

చిన్నపుల్లయ్య కుమారులకు రశీదు ఇస్తున్న కమిటీ బాధ్యులు

చిన్నవెంకటేశ్ (ఫైల్)