ఖమ్మం మార్కెట్‌కు హంగులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ముఖద్వారం  - Sakshi

ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోని పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్త హంగులు సంతరించుకోనున్నాయి. వ్యవసాయ మార్కెట్‌లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.10.34 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వ్యవసాయ మార్కెట్‌, హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్లలో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే ఈ పనులు మొదలుకానుండగా.. రైతులకు మరిన్ని వసతులు సమకూరనున్నాయి.

రాష్ట్రంలోనే ప్రత్యేకం

ఉమ్మడి ఏపీలోనే ఖమ్మం మార్కెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం గాంధీచౌక్‌ సెంటర్‌గా ఏర్పాటైన బీటుబజార్‌ ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్‌గా రూపాంతరం చెందింది. అపరాలు, మిర్చి, పత్తి పంటలకు ప్రత్యేకంగా వేర్వేరుగా మూడు యార్డులను ఏర్పాటు చేశారు. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌ పత్తి, మిర్చి కొనుగోళ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించింది. ఇక్కడ ప్రధానంగా మిర్చి, పత్తి కొనుగోళ్లు అధికంగా జరుగుతుంటాయి. ఖమ్మం జిల్లాతో పాటు, పరిసర జిల్లాలైన మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, హన్మకొండ జిల్లాలే కాక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు మిర్చి, పత్తి తీసుకొస్తారు. అలాగే, ఇక్కడి వ్యాపారులు తేజా రకం మిర్చిని చైనా, మలేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏటా రూ.2 వేల కోట్లకు పైగా లావా దేవీలు ఇక్కడ నమోదవుతాయి. టర్నోవర్‌, అవసరాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు నిధు లు మంజూరు చేసింది. మార్కెట్‌లోని యార్డులు, ఈ–మార్కెట్‌ పరిధిలో కొనసాగుతున్న ఖమ్మం బైపాస్‌ రోడ్డులోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. యార్డులు, హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో 15 రకాల పనులు చేపట్టేందుకు మార్కెట్‌ కమిటీ తీర్మానించించగా.. రహదారులు, డ్రెయిన్లు, ఆర్చీలు, ఇతర పనులు ఈ జాబితాలో ఉన్నాయి.

మారనున్న రూపురేఖలు

ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10.34 కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టే పనులతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ రూపురేఖలు మారనున్నాయి. మార్కెట్‌ యార్డులకు ఆర్చీల నిర్మాణం, రహదార్లు, డ్రెయిన్లతో ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు తీరనున్నాయి. అలాగే, మార్కెట్‌ కమిటీ కార్యకలాపాలకు నూతన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. మార్కెటింగ్‌ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ విభాగం ఈ పనులను పర్యవేక్షించనుంది.

చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలు

త్వరలోనే రూ.10.34 కోట్లతో అభివృద్ధి పనులు

వ్యవసాయ, కూరగాయల మార్కెట్లలో 15 పనులకు ప్రణాళిక

తద్వారా రైతులకు వసతులు,

మారనున్న రూపురేఖలు

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తాం. పనులు, అంచనాలు రూపొందించడమే కాక మార్కెట్‌ తరఫున తీర్మానాలు చేశాం. అలాగే, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఆయా పనులు త్వరలోనే మొదలుకానుండగా. నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాం.

–దోరేపల్లి శ్వేత, చైర్‌పర్సన్‌,

వ్యవసాయ మార్కెట్‌

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top