
ఆస్పత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న బృందం సభ్యులు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని బుధవారం లక్ష్య, ముస్కాన్ జాతీయ బృందాలు పరిశీలించాయి. ఈసందర్భంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అందుతున్న సేవలను డాక్టర్ రతి మాలచంద్రన్, డాక్టర్ సంధ్య పాప్‌నేజ ఆధ్వర్యంలోని బృందం పరిశీలించి వివరాలు ఆరాతీసింది. పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్, గైనిక్ థియేటర్, ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ, లేబర్‌రూం, ఎంసీహెచ్ ఓటీ, డీఈఐసీ విభాగం, మిల్క్ బ్యాంక్‌లను పరిశీలించారు. కాగా, ఈ బృందాల పరిశీలన గురువారం కూడా కొనసాగుతుంది. ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా లక్ష్య అవార్డు వరిస్తే ఆస్పత్రికి ఏటా రూ.6లక్షల చొప్పున మూడేళ్లు, ముస్కాన్ అవార్డు వస్తే రూ.12 లక్షల చొప్పున మూడేళ్ల పాటు నిధులు అందుతాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంఓ బి.శ్రీనివాసరావు, డాక్టర్లు కృపా ఉషశ్రీ, మంగళ, ప్రసన్న జ్యోతి, పవన్, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, క్వాలిటీ మేనేజర్ ఉపేందర్, సఫియా, లావణ్య, వినయ్ పాల్గొన్నారు.