
మహిళలతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ స్నేహలత
రఘునాథపాలెం/ఖమ్మం రూరల్: మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాధినిర్ధారణ, ఉచిత చికిత్స కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ, ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెంలోని పీహెచ్‌సీలో మంగళవారం మహిళలకు నిర్వహిస్తున్న పరీక్షలను ఆమె పరిశీలించి మాట్లాడారు. మహిళా ఆరోగ్య కేంద్రాల్లోని ఎనిమిది విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలపై ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎంలు ప్రచారం చేయాలని సూ చించారు. మహిళలకు పరీక్షలు నిర్వహించాక ఆన్‌లైన్‌లో నమోదు, చికిత్స వివరాలను పరిశీలించిన అదనపు కలెక్టర్.. సూచనలు చేశారు. వైద్యాధికారులు సంధ్యారాణి, శ్రీదేవి, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు
603మంది గైర్హాజరు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ద్వితీయ సంవత్స రం పరీక్షకు జిల్లాలో 16,016మంది విద్యార్థులు గాను 15,413మంది హాజరు కాగా 603 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. జనరల్ విభాగంలో 13,895మందికి 13,428మంది, ఒకేషనల్ విభాగంలో 2,121మందికి 1,985మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన వెల్లడించారు.