
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ మధుసూదన్
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఆలయానికి రంగులు వేయడంతో పాటు మంగళవారం శుద్ది సంప్రోక్షణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వరస్వామి వారికి పంచామృతంతో అభిషేకం, కలశస్థాపన, పంచాంగ శ్రవణంతో పా టు పుష్కరిణి నుండి యాగశాలకు తీర్థపు బిందె తోడ్కోని వస్తామని ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తెలిపారు.
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి
ఖమ్మంలీగల్: అవినీతి రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన న్యాయశాఖలోని నాలుగో తరగతి ఉద్యోగులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతర శ్రమతో మంచి ఫలితం వస్తుందని తెలిపారు. ఏ పనైనా ఇష్టంగా చేస్తూ, లంచం లేని సమాజాన్ని నిర్మించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాసంస్థ కార్యదర్శి జావేద్‌పాషా, న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ, అధికారులు ఓంకార్, రాధేశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు
ఖమ్మం సహకారనగర్: రబీ సీజన్‌లో జిల్లా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాటుచేయనున్న కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ ఏడాది రబీలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పగా.. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే దిగుమతికి అవకాశం ఉందని మిల్లర్లు వెల్లడించారు. దీంతో అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖాధికారి రాజేందర్, డీఎం సోములు, ఏఎంటీ నర్సింహరావు, డీఆర్‌డీఓ విద్యాచందన, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.