కాంగ్రెస్‌ను వీడని వర్గ రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడని వర్గ రాజకీయాలు

Mar 22 2023 12:38 AM | Updated on Mar 22 2023 9:47 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్‌లో అనైక్యత మరోసారి బయటపడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతా కలిసికట్టుగా పనిచేయాలని అధిస్టానం సూచించినా జిల్లా పార్టీలో ఆ దిశగా అడుగులు పడటం లేదు. నేతలు వర్గాలుగా విడిపోవడం, వెన్నుదన్నుగా నిలవాల్సిన వారే పార్టీని బలహీన పరుస్తున్నారని కార్యకర్తలు నైరాశ్యానికి గురవుతున్నారు. వైరాలో ఈనెల 26న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర చేపడుతున్నట్లుగా కేంద్ర మాజీ మంత్రి రేణుక వర్గీయులు సోమవారం వెల్లడించారు. అయితే, ఈ విషయమై ఇటు పార్టీ జిల్లా అధ్యక్షుడికి కానీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కానీ కనీస సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలు జిల్లాలో మరోసారి రేణుక – భట్టి వర్గీయుల మధ్య విబేధాలను బహిర్గతం చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చేతికి చేయి కలుపు(హాథ్‌ సే హాథ్‌ జోడో) అంటూ యాత్రలు నిర్వహిస్తుండగా జిల్లాలో అందుకు విరుద్దమైన పరిస్థితులు నెలకొనడం గమనార్హం.

వైరాలో భట్టి వర్సెస్‌ రేణుక..
వైరాలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గం నుంచి ధరావత్‌ రామ్మూర్తినాయక్‌, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గం నుంచి మాలోతు రాందాస్‌నాయక్‌, బానోత్‌ బాలాజీనాయక్‌ టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో రాందాస్‌, రామ్మూర్తి వైరాలో క్యాంప్‌ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. బాలాజీనాయక్‌ కొంత స్తబ్దుగా ఉన్నారు. ఇక్కడ సీఎల్పీ నేత భట్టి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లావ్యాప్తంగా గ్రూపు రాజకీయాలు ఉన్నా.. వైరాలో మాత్రం కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సీఎల్పీ నేత, డీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే..
రేణుకాచౌదరి వర్గీయులు వైరాలో సోమవారం సమావేశం ఏర్పాటుచేసిన ఈనెల 26న వైరాలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర, బహిరంగ సభ ఉంటాయని.. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌, పీసీసీ చీఫ్‌ వస్తున్నప్పటికీ.. దీనిపై తమ కు సమాచారం లేదని భట్టి వర్గీయులు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ చెబుతుండడం వైరా నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కేడర్‌లో చర్చకు దారి తీసింది. వైరాలోనే కాక జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ ఇదే పరిస్థితి ఉండడం కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమవుతోంది. తాము పార్టీపై అభిమానంతో పనిచేస్తుంటే నాయకులు వర్గాలుగా విడిపోయి చేటు చేస్తున్నారని ఆవేదనకు లోనవుతున్నారు. ఇకనైనా అధిష్టానం వర్గ విభేదాలపై దృష్టి సారిస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయావకాశాలు మెరుగవుతాయని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి దారి వారిదే..
జిల్లా కాంగ్రెస్‌ను దశాబ్దాలుగా వర్గపోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలో ఉన్నా, లేకున్నా నేతల మధ్య ఐక్యత, సఖ్యత కనపడటం లేదు. జిల్లాస్థాయిలోనే కాక నియోజకవర్గాల్లోనూ గ్రూపులు కాంగ్రెస్‌లో ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. టికెట్లు అశిస్తున్న నియోజకవర్గ స్థాయి నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. వీరికి జిల్లాలోని రాష్ట్రస్థాయి నేతలు అభయం ఇస్తుండడం గమనార్హం. ఖమ్మం, సత్తుపల్లి, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగా ఉండగా.. అధిష్టానం పిలుపునిచ్చే ఆందోళనలను కూడా గ్రూపుల వారీగానే నిర్వర్తిస్తున్నారు. గతంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడి నియామకం విషయంలోనూ గ్రూపు రాజకీయాల కారనంగా చాన్నాళ్లు ప్రతిష్ఠంభన నెలకొనగా... పీసీసీకి సైతం తలనొప్పిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement